ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో..కేసీఆర్ చేసింది తప్పే : వినోద్​

ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో..కేసీఆర్ చేసింది తప్పే : వినోద్​
  •     అట్ల చేయొద్దని అప్పుడే చెప్పిన : బీఆర్​ఎస్​ నేత వినోద్​ 
  •     కేసీఆర్​ చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ చేస్తున్నడు
  •     ప్రభుత్వాన్ని పడగొడ్తామని మేం చెప్పలేదు
  •     ట్రాన్స్‌‌కోలో ఉద్యోగం పొందిన సరిత నా చుట్టం కాదు..
  •     ఆమె కేసీఆర్​ మేనల్లుడి భార్య అని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో బీఆర్‌‌‌‌ఎస్ తప్పు చేసిందని ఆ పార్టీ నేత, కరీంనగర్‌‌‌‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌‌కుమార్ అన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్పు అని తాను కేసీఆర్‌‌‌‌కు అప్పుడే చెప్పానని ఆయన వెల్లడించారు. అప్పుడు అది తమ పార్టీ అంతర్గత విషయం కావడంతో బయటకు మాట్లాడలేదని అన్నారు. ఇప్పుడు అదే తప్పును కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదని విమర్శించారు. ‘‘ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిన రేవంత్‌‌రెడ్డి.. ఇప్పుడు సీఎం అయ్యాక ఆయనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నడు. 

ఎన్నికలు జరిగి 4 నెలలు కూడా గడవకముందే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరమేమొచ్చింది” అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొడుతామని తాము చెప్పలేదని, ఆయనకు ఆయనే(రేవంత్‌‌రెడ్డి) ఏదో ఊహించుకుని ఆందోళన చెందుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్‌‌‌‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌‌‌‌ను కోరామని, స్పీకర్‌‌‌‌ ఈ విషయంలో వీలైనంత త్వరగా  నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌‌లో వినోద్​కుమార్​ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని, కానీ.. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారి ప్రజలను మోసగించొద్దని అన్నారు. 

ఆ డబ్బు నాది కాదు

ఇటీవల కరీంనగర్‌‌ ప్రతిమ మల్టీప్లెక్స్‌‌లో దొరికిన‌‌ రూ.6.75 కోట్ల డబ్బుతో తనకు సంబంధం లేదని వినోద్‌‌కుమార్ అన్నారు. ఆ మల్టీప్లెక్స్‌‌లో 4 థియేటర్లు, రెండు బార్లు, వంద బెడ్ల కెపాసిటీ ఉన్న హోటల్ ఉన్నాయని, వందలాది మంది అక్కడ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం, ఇతర వ్యాపార కార్యక్రమాలకు సంబంధించిన డబ్బు కావచ్చునేమోనని అన్నారు. ఆ మల్టీప్లెక్స్ తన చుట్టాలదే అయినప్పటికీ, అక్కడ దొరికిన డబ్బుతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు.

 ‘‘చాలా మంది బంధువులు ఉంటరు. ఎక్కడేం జరిగినా నాకే అంటగడితే ఎలా? నీరవ్ మోదీ అనెటోడు పెద్ద లంగ, లఫూట్. ఆయనకు చివర్లో మోదీ అని ఉన్నంత మాత్రానా ప్రధాని మోదీకి, నీరవ్ మోదీకి అవినీతి అంటగడితే ఎలా?’’ అని వినోద్​ కుమార్​ ప్రశ్నించారు. ట్రాన్స్‌‌కోలో బోయినపల్లి సరిత అనే అమ్మాయికి తాను ఉద్యోగం ఇప్పించినట్టు గతంలో వచ్చిన ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. 

అప్పుడు కూడా తనపై ఆరోపణలు చేశారని, వాస్తవానికి ఆ అమ్మాయి తనకు చుట్టమే కాదని తెలిపారు. ఆమె తమ పార్టీ ప్రెసిడెంట్‌‌ కేసీఆర్ మేనల్లుడి భార్య అని వినోద్‌‌కుమార్‌‌‌‌ వెల్లడించారు. ఇదే విషయాన్ని తాను గతంలో కూడా చెప్పానని, కానీ.. మీడియా ఈ విషయాన్ని ప్రజలకు చూపించడం లేదని ఆయన అన్నారు.