
రెజీనా కసాండ్రా, దిలీప్ ప్రకాష్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మిస్తున్నారు. అంతరించిపోతున్న నాటక రంగం, కళాకారుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
‘ఏం దురభిమాన దుర్యోధన.. ఏమైంది నీ అఖండ సామ్రాజ్య వైభవం.. ఎక్కడ నీ హంస తూళిక.. వినిపింపవే సుప్రభాత గీతికలు.. ఆక్రోశించటమే కౌంతేయ కాదు.. నీకు మరణమే మేలు సుయోధనా’ అంటూ బ్రహ్మానందం డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
రెజీనా, దిలీప్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఇంటరెస్టింగ్‌గా ఉంది. తనను ప్రేమించే వ్యక్తి తనలో సగభాగం ఇచ్చేవాడు అవ్వాలని కోరుకుంటుంది రెజీనా. ‘చాలా సార్లు ప్రేమికుడిగా ఇంప్రెస్ చేశావు కానీ.. ఒక మనిషిగా ఒక్కసారైనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించావా’ అని దిలీప్‌తో రెజీనా చెప్పే డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
నాటక రంగానికి ఉన్న ప్రాముఖ్యతను చూపిస్తూ హీరోహీరోయిన్ మధ్య సాగిన ప్రేమ ఆకట్టుకుంటుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, ఆమని, సుధ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సెప్టెంబర్ 13న సినిమా విడుదల కానుంది.