మైత్రీవనం HMDA ఆఫీసు దగ్గర ఉద్రిక్తత.. రీజనల్ రింగు రోడ్డుకు భూములు ఇవ్వబోమంటూ బాధితుల ధర్నా..

మైత్రీవనం HMDA ఆఫీసు దగ్గర ఉద్రిక్తత.. రీజనల్ రింగు రోడ్డుకు భూములు ఇవ్వబోమంటూ బాధితుల ధర్నా..

హైదరాబాద్ లోని మైత్రీవనంలో ఉన్న HMDA ఆఫీసు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ( సెప్టెంబర్ 8 ) రీజనల్ రింగ్ రోడ్డుకు తమ భూములు ఇవ్వబోమంటూ బాధితులు ఆందోళనకు దిగటంతో ఉద్రిక్తత నెలకొంది. తక్కువ ధరకు తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు బాధితులు. చౌటుప్పల్ దగ్గర పాత అలైన్మెంట్ మార్చారని.. పాత అలైన్మెంట్ నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.

తమ భూముల జోలికి రావద్దంటూ నినాదాలు చేస్తూ HMDA ఆఫీసు దగ్గర ఆందోళనకు దిగారు రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు. ఇటీవలే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కి సంబంధించిన ప్రైమరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది HMDA. అలైన్మెంట్ విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే.. సెప్టెంబర్ 15 లోపు తెలపాలని కోరారు అధికారులు. దీంతో HMDA ఆఫీసు దగ్గరకు చేరుకొని భూములు ఇవ్వబోమంటూ ఆందోళనకు దిగారు బాధిత రైతులు.

ఇటీవల రీజినల్ రింగ్ రోడ్ (RRR) అలైన్‌మెంట్ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ అలైన్‌మెంట్ ఎనిమిది జిల్లాలు, 33 మండలాలు అలాగే 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలకి విస్తరించగా, డిజిటల్ మ్యాప్‌లు & సర్వే నంబర్‌లను HMDA  అఫీషియల్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 

ప్రజలు, సంస్థలు 15 సెప్టెంబర్  2025లోపు ఏదైన అభ్యంతరాలు, సూచనలు ఉంటే HMDA కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. దీని తర్వాత HMDA చివరి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది.