
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌లో బోధనా ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్‌కు మారుతున్న కాలానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇందుకోసం ప్రత్యేకంగా అధునాతన వసతులతో మంచి భవనం నిర్మించాలని భావిస్తోంది.
ఈ భవన నిర్మాణం కోసం ఇటీవల కబ్జా నుంచి హైడ్రా విడిపించిన ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ స్థలాన్ని ఎంపిక చేసింది. శంషాబాద్ మండలం శాతంరాయి గ్రామంలో 2011లో ప్రభుత్వం 12 ఎకరాలను ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌కు కేటాయించింది. అయితే, దీన్ని కొందరు కబ్జా చేశారు. దీనిపై ఇంటర్ బోర్డు అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కబ్జాదారుల చెర నుంచి ఆ భూములను విడిపించారు.
అయితే, ఖాళీ స్థలం ఉండటంతోనే.. ఇలా కబ్జా అయిందని భావించిన అధికారులు అక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన ఒక రీజినల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ శిక్షణా కేంద్రాన్ని సుమారు రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించడానికి బోర్డు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ సంస్థ ద్వారా ఇంటర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్, ఇతర సిబ్బందికి క్రమం తప్పకుండా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. సర్కారు నుంచి పూర్తిస్థాయి అనుమతులు రాగానే ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.