అనధికార లే అవుట్లలో ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేయండి

అనధికార లే అవుట్లలో ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేయండి
  • రాష్ట్ర సర్కార్​కు హైకోర్టు ఆదేశం
  • కొన్ని షరతులు విధిస్తూ ఉత్తర్వులు
  • 2020 ఆగస్టులో రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన సర్కారు

హైదరాబాద్, వెలుగు: అనధికార లే అవుట్లలోని ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్లు చేయాలని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. అనుమతులు లేని లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ 2020 ఆగస్టు 26న ఇచ్చిన మెమోతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలంది. మెమోతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని గతంలో డివిజన్‌‌ బెంచ్‌‌ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో స్టే ఇవ్వకపోయినా సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేయడం లేదంటూ ఐదు వేలకుపైగా కేసులు దాఖలయ్యాయి. వీటిని విచారించిన జస్టిస్‌‌‌‌‌‌‌‌ బి.విజయ్‌‌‌‌‌‌‌‌సేన్‌‌‌‌‌‌‌‌రెడ్డి షరతులతో కూడిన కీలక ఉత్తర్వులు ఇచ్చారు.

కొనేటోళ్లదే పూర్తి బాధ్యత
తమ ఆదేశాలు, అమ్మకాలు కొనుగోళ్లు సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రతి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్, లాస్ట్‌‌‌‌‌‌‌‌ పేజీల వెనుక వైపు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సదరు రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చెల్లుబాటు అవుతుందని రాయాలని, ఈసీ(ఇన్​కంబరెన్స్ సెర్టిఫికెట్)లో కూడా అదే షరతు పెట్టి జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 30 అడుగుల రోడ్డు లేకుండా ఉన్న లేఅవుట్లల్లో స్థలాలు, వాటిలో నిర్మాణాలు, అనుమతి లేని లేఅవుట్ల వ్యవహారంలో కొనుగోలుదారులే పూర్తి బాధ్యత వహించాల్సివుంటుందని హైకోర్టు హెచ్చరించింది. ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్, బఫర్‌‌‌‌‌‌‌‌జోన్, 30 అడుగుల రోడ్డు వంటి రూల్స్​కు అనుగుణంగా ఉందా లేదా అనే బాధ్యత కొనుగోలుదారులదేనని చెప్పింది. ఈ విషయాలన్నీ కొనుగోలుదారులకు సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్లు వివరించాలని, రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌లో మొదటి పేజీ వెనుక (రెండో పేజీ)లో పేర్కొనాలని చెప్పింది. చట్టప్రకారం లేని వాటిని కొనుగోలు చేస్తే దాని బాధ్యత కొనుగోలుదారులే వహించాలంది. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.