Kohrra Season 2 Trailer: ‘మరింత లోతైన హత్య మిస్టరీతో ‘కోహ్రా’ సీజన్ 2.. ఉత్కంఠగా డార్క్ ఇన్వెస్టిగేషన్

Kohrra Season 2 Trailer: ‘మరింత లోతైన హత్య మిస్టరీతో ‘కోహ్రా’ సీజన్ 2.. ఉత్కంఠగా డార్క్ ఇన్వెస్టిగేషన్

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకాదరణ పొందిన క్రైమ్ డ్రామా సిరీస్ ‘కోహ్రా’ సీజన్ 2. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్‌. మబ్బులతో కమ్ముకున్న డాలర్‌పురా అనే పట్టణాన్ని నేపథ్యంగా చేసుకుని సాగే ఈ కొత్త సీజన్, మరింత డార్క్‌, లోతైన మర్డర్ మిస్టరీతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. 

ఈ సీజన్ కథ విషయానికి వస్తే, ప్రీత్ బజ్వా (పూజా భమ్ర్రా) అనే మహిళ హత్య చుట్టూ తిరుగుతుంది. ఆమె శవం తన అన్న గోదాంలో లభించడం సంచలనంగా మారుతుంది. ఈ హత్య వెనుక నిజం ఏమిటన్నది తెలుసుకునే క్రమంలో అనుమానాలు ఆమెకు అత్యంత సమీపంలోని వారిపై పడతాయి. ముఖ్యంగా ఆమె భర్త పాత్రలో నటించిన రణ్‌విజయ్ సింఘా క్యారెక్టర్ కీలకంగా మారుతుంది.

ఈ కేసును అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అమర్‌పాల్ గరుండి (బరుణ్ సోబ్తి) దర్యాప్తు చేస్తాడు. అయితే ఈసారి అతడు కొత్త కమాండింగ్ ఆఫీసర్ అయిన సబ్ ఇన్‌స్పెక్టర్ ధన్వంత్ కౌర్ (మోనా సింగ్) ఆధ్వర్యంలో పనిచేయాల్సి వస్తుంది. ట్రైలర్‌లో గరుండి యొక్క ఇన్‌స్టింక్ట్ ఆధారిత విచారణ శైలి, ధన్వంత్ కౌర్ యొక్క ప్రశాంతమైన, క్రమబద్ధమైన విధానానికి విరుద్ధంగా చూపించారు. ఇందులో ఉన్న మిస్టరీస్, దాగుండిపోయిన నిజాలు, గత గాయాలు కలగలిసిన ఈ దర్యాప్తు కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చనుంది. ‘కోహ్రా సీజన్ 2’ ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది

ఈ సందర్భంగా బరుణ్ సోబ్తి మాట్లాడుతూ, “ఈ సీజన్‌లో గరుండి పాత్ర మరింత అంతర్ముఖంగా ఉంటుంది. కొత్తగా మొదలు పెట్టాలని అనుకున్నా, కోహ్రా ప్రపంచంలో గతం వెంటాడుతూనే ఉంటుంది. ఈసారి మిస్టరీ మరింత లోతుగా ఉంటుంది” అని తెలిపారు.

మోనా సింగ్ తన పాత్ర గురించి మాట్లాడుతూ, “ధన్వంత్ కౌర్ తక్కువ మాటలు మాట్లాడే కానీ దృఢనిశ్చయం గల మహిళ. నష్టం, బాధ్యత, తనను తాను నిరూపించుకోవాల్సిన ఒత్తిడితో ఆమె పోరాటం సాగుతుంది” అని చెప్పారు.

ఏ ఫిల్మ్ స్క్వాడ్, యాక్ట్ త్రీ సంస్థల సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ సిరీస్‌కు సుదీప్ శర్మ, ఫైసల్ రెహమాన్ దర్శకత్వం వహించారు. సుదీప్ శర్మకు ఇది దర్శకుడిగా తొలి ప్రాజెక్ట్‌. గుంజిత్ చోప్రా, దిగ్గి సిసోడియా, సుదీప్ శర్మ ఈ సిరీస్‌ను సృష్టించి కథను అందించారు.