10 రోజులుగా స్తంభించిన కార్యకలాపాలు
ఆందోళన చెందుతున్న రియల్టర్లు, దళారులు
నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని మూడు సబ్రిజిస్ట్రార్ఆఫీస్ లలో పది రోజులుగా రిజిస్ట్రేషన్ప్రక్రియ నిలిచిపోయింది. డైరెక్టర్ఆఫ్టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) అనుమతి ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేయాలని కలెక్టర్ముషారఫ్అలీ ఫారూఖీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు... అనుమతుల వివరాలన్నీ తనకు చూపించిన తర్వాతే ప్లాట్లు రిజిస్ట్రేషన్చేయాలన్నారు. మొన్నటి వరకు ఏదిపడితే అది రిజిస్ట్రేషన్చేసిన ఆఫీసర్లు ఇప్పుడు డైలామాలో పడ్డారు. రియల్టర్లు, బ్రోకర్లు ఖంగు తిన్నారు.
అనుమతులు ఉంటేనే..
నిబంధనల ప్రకారం డీటీసీపీ అనుమతులు ఉంటేనే వెంచర్ల లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలి. నిర్మల్, భైంసా, ఖానాపూర్ సబ్ రిజిస్ట్రార్ ల పరిధిలోని ఒకటి రెండు వెంచర్లకు తప్ప ఎక్కడ కూడా అనుమతులు లేవని తెలిసింది. అంతేకాదు జిల్లాలో ఏళ్లకేళ్లుగా డీటీసీపీ పర్మిషన్లేకుండానే వెంచర్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వాటిలో చాలామంది ప్లాట్లు కొని మోసపోయారు. పొలిటికల్లీడర్లే రియల్టర్ల అవతారం ఎత్తడంతో అక్రమ వెంచర్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నిర్మల్ లో ప్రతీరోజు 40 నుంచి 50 ప్లాట్ల వరకు రిజిస్ట్రేషన్చేస్తారు. భైంసాలో 20 నుంచి 30, ఖానాపూర్ లో దాదాపు 20 వరకు రిజిస్ట్రేషన్ జరుగుతాయని ఆఫీసర్లు తెలిపారు.
జిల్లా కేంద్రంగా మారడంతో..
నిర్మల్‌జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత రియల్‌ఎస్టేట్‌వ్యాపారం ఊపందుకుంది. ఒక్కో ప్లాట్ రూ. 50 లక్షలకు అమ్ముడుపోతోంది. దీనిని అదునుగా తీసుకున్న కొంత మంది లీడర్లు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వెంచర్లు ఏర్పాటు చేశారు. కేవలం నాలా కన్వర్షన్ , గ్రామపంచాయతీ అనుమతి తీసుకొని ప్లాట్లు అమ్మారు. రోడ్లు, మురికి కాల్వలు కనీస సౌకర్యాలు చూపకుండానే అమాయకులకు అంటగట్టి లక్షలు దండుకున్నారు. అయినా ఏ ఒక్క ఆఫీసర్ అటువైపు కన్నెత్తి చూడలేదు. కొందరు రిజిస్ట్రార్లు సైతం నిబంధనలు పక్కనపెట్టి ఇష్టమొచ్చినట్లు వెంచర్లను రిజిస్ట్రేషన్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసుకున్న కలెక్టర్ ఫారూఖీ డీటీసీపీ అనుమతులు లేనిదే రిజిస్ట్రేషన్లు చేయొద్దని ఆదేశాలు జారీచేశారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా డీటీసీపీ అనుమతి ఇచ్చిన వెంచర్లు లేకపోవడంతో రియల్టర్లు, బ్రోకర్లు లబోదిబో మంటున్నారు. ప్లాట్లు తీసుకున్న వారు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. కార్యకలాపాలు లేక సబ్ రిజిస్ట్రార్ఆఫీసులన్నీ వెలబెలబోతున్నాయి.
మొన్నటి వరదలతో బాగోతం బయటకు..
మొన్నటి వరదలతో నిర్మల్, భైంసా, ఖానాపూర్లోని చాలా వెంచర్లు నీటమునిగాయి. నిర్మల్ లోని జీఎన్ఆర్ కాలనీతో పాటు నిర్మల్ నుంచి కన్కాపూర్, సోఫీనగర్, మంజూలపూర్, చించోలి వరకు ఉన్న వెంచర్లలో మట్టి, ఇసుక మేటలు వేసింది. ఇవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటుచేసినవే. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అనుమతులు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ ల వ్యవహారంపై దృష్టి సారించారు.
అనుమతులు తప్పనిసరి..
డీటీసీపీ అనుమతులు లేకుండా ఏ ఒక్క ప్లాట్ కు రిజిస్ట్రేషన్చేయం. ప్లాట్ల క్రయ విక్రయాలు, వెంచర్ల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి. పర్మిషన్లేని వెంచర్లలో ఎవరూ ప్లాట్లు కొనవద్దు. తర్వాత ఇబ్బందులు పడొద్దు.
– కిరణ్, నిర్మల్ సబ్ రిజిస్ట్రార్
