రెగ్యులర్ టీచర్లు ప్రమోషన్ పై బదిలీ.. డిప్యూటేషన్ పై రోజుకొకరు..!

రెగ్యులర్ టీచర్లు ప్రమోషన్ పై బదిలీ.. డిప్యూటేషన్ పై రోజుకొకరు..!
  • జనగామ జిల్లాలోని నక్కవానిగూడెం ప్రభుత్వ స్కూల్ పరిస్థితి ఇది
  • 12 మంది విద్యార్థులు చదువుతుండగా సరిగా సాగని బోధన

బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని నక్కవానిగూడెం స్కూల్​లో  బోధించేందుకు రోజుకో టీచర్​డిప్యూటేషన్ పై వస్తుండగా విద్యార్థులు సరిగా రావడం లేదు. స్కూల్​లో 12 మంది విద్యార్థులు ఉండేవారు. ఇక్కడున్న ఇద్దరు టీచర్లకు గత నెలలో ప్రమోషన్​పై వెళ్లిపోయారు. దీంతో రెగ్యులర్ టీచర్లు లేక డిప్యూటేషన్ వస్తుండగా స్టూడెంట్లు కూడా సరిగా స్కూల్ కు రావడం లేదు. బుధవారం రామచంద్రాపూర్​స్కూల్​టీచర్​సద్గుణాచారిని డిప్యూటేషన్ పంపించారు. తన స్కూల్ లో సబ్జెక్టులు బోధించే చాన్స్ కోల్పోతున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

రెగ్యులర్ టీచర్లను నియమించకుండా రోజుకొకరిని పంపిస్తుండడంతో విద్యాశాఖపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మండలంలో  ఏడు స్కూళ్లు మూతపడ్డాయి. బసిరెడ్డిపల్లిలో రెండు, పుల్లగూడ, జయ్యాల, హనుమాన్​పేట, కోనాలగడ్డ, సదాశివపేట ఏడు ఉన్నాయి.  నక్కవానిగూడెం స్కూల్ సమస్యపై నెల రోజులుగా డీఈవో దృష్టికి తీసుకెళ్తున్నా ఫలితం లేకపోవడంతో రోజుకో టీచర్​ను డిప్యూటేషన్​పై ​ పంపిస్తున్నామని ఎంఈవో వెంకట్​రెడ్డి తెలిపారు. త్వరలో రెగ్యులర్ టీచర్​ను నియమిస్తామని, అయితే డీఈవో లేకపోవండతో ఇబ్బందిగా మారిందని చెప్పారు.