పునర్జన్మ: అమ్మమ్మే తన భార్య అంటున్న ఎనిమిదేళ్ల బాలుడు

పునర్జన్మ: అమ్మమ్మే తన భార్య అంటున్న ఎనిమిదేళ్ల బాలుడు

'తొందరగా పెళ్లి చేసుకోరా.. చనిపోయిన మీ నాన్న నీ కడుపున పుడతాడు..' అంటూ ఇంట్లో పెద్దలు చెప్పడం కామన్. సినిమాల్లోనూ ఇలాంటి పునర్జన్మ సంఘటనలు ఎన్నో చూసుంటాం. మరి అలాంటి ఘటన నిజంగా జరిగితే! ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన ఆర్యన్‌ అనే ఎనిమిదేళ్ల బాలుడు తన పూర్వజన్మ గురించి చెబుతున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం తాను పాము కాటుతో చనిపోయానని, తన పేరు మనోజ్ అని వాదిస్తున్నాడు. పోనీ, అక్కడితో ఆగాడా! లేదు. గత జన్మలో అమ్మమ్మే తన భార్య అని.. తల్లి తన కుమార్తె అని, మేనమామలిద్దరూ తన కుమారులని చెప్తున్నాడు.


ఎనిమిదేళ్ల క్రితం (2015 జనవరి 9) ఈ బాలుడి తాత మనోజ్‌ మిశ్రా చనిపోయారు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో మనోజ్‌ మిశ్రా కుమార్తె నిండు గర్భిణి. అది జరిగిన 20 రోజులకు ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడే మనోజ్‌ మిశ్రా అంటున్న బుడతడు. రెడ్రోజుల క్రితం అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆర్యన్‌ విచిత్రంగా ప్రవర్తించాడట. తన పేరు మనోజ్‌ అని, తన పేరిట బ్యాంకులో డబ్బులు కూడా ఉన్నట్లు వారికి చెప్పాడట. ఇంకేముంది ఈ మాట గ్రామస్థుల చెవిన పడటం.. అది మీడియాకు చేరడంతో అందరూ అతని ఇంటికి క్యూ కడుతున్నారు.