ఆసిఫాబాద్, వెలుగు: ఇరువర్గాల ఘర్షణతో అట్టడుగుతున్న కుమురం భీం ఆసిఫాబాద్జిల్లా జైనూర్ పరిసరాల్లో ఆదివారం ప్రశాంతత నెలకొంది. ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం, హత్యాయత్నం అనంతరం జైనూర్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా, ఇరువర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. పరిస్థితి చేజారుతున్న సమయంలో ప్రభుత్వం సీరియస్గా స్పందించి అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి పోలీసుల పహారాలో ఉన్న జైనూర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు. అదనపు డీజీ, ఐజీ, కలెక్టర్స్దాయి ఉన్నతాధికారులు జైనూర్ లో మకాం వేసి ఇరువర్గాలతో చర్చించారు.
ఏజెన్సీ ప్రాంతంలోని జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, కెరమెరి, తిర్యాణి, వాంకిడి మండలాలు మినహా జిల్లా అంతా శనివారం సాయంత్రం నుంచి ఇంటర్నెట్ సేవలను ప్రారంభించారు. ఘర్షణకు పాల్పడ్డ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. శాంతియుత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఆదివారం పోలీస్ అధికారులు ప్రత్యేక బలగాలతో జైనూర్లో ర్యాలీ నిర్వహించారు.
జైనూర్లో శాంతి భద్రతలను కాపాడేందుకు విధించిన 144 సీఆర్పీసీ సెక్షన్లో కొంత సడలింపు ఇచ్చామని కలెక్టర్ వెంకటేశ్ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి, మిలాద్- ఉన్- నబీ పండుగల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు సడలింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకొని మత సామరస్యాన్ని కాపాడాలని, శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.