దుబాసి దేవేందర్​ను రిలీజ్ చేయండి.. ఎన్ఐఏను ఆదేశించిన హైకోర్టు

దుబాసి దేవేందర్​ను రిలీజ్ చేయండి.. ఎన్ఐఏను ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: నిందితులను అరెస్ట్ చేసే సమయంలో రూల్స్ పాటించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను హైకోర్టు ఆదేశించింది. అక్రమంగా అరెస్ట్‌‌ చేసిన దుబాసి దేవేందర్‌‌ను వెంటనే రిలీజ్ చేయాలని చత్తీస్​గఢ్​లోని జగల్‌‌పూర్‌‌ జిల్లా జైలు సూపరింటెండెంట్, ఎన్‌‌ఐఏ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చింది. సిద్దిపేట ప్రభుత్వ కాలేజ్​లో ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన తన భర్త దేవేందర్‌‌ను మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి ములుగు పోలీస్ స్టేషన్​కు తరలించారని అతని భార్య స్వప్న హైకోర్టును ఆశ్రయించారు.

ములుగు పోలీస్ స్టేషన్ నుంచి చత్తీస్​గఢ్ తీసుకెళ్లారని, తన భర్తకు ప్రాణ హాని ఉందన్నారు. దేవేందర్ మావోయిస్టులకు కొరియర్​గా పని చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, 2019లో కేసు నమోదైందని కోర్టుకు ఎన్ఐఏ అధికారులు వివరించారు. 41ఏ నోటీసు కూడా ఇచ్చామని తెలిపారు. అయితే, ఆ నోటీసులో విజయవాడ ఎన్‌‌ఐఏ క్యాంప్‌‌ ఆఫీస్‌‌ అడ్రస్‌‌ ఉండటాన్ని కోర్టు తప్పుబడుతూ, దేవేందర్​ను విడుదల చేయాలని ఆదేశించింది.