డిసెంబర్ 28 నుంచి రైతుబంధు నిధుల విడుదల

డిసెంబర్ 28 నుంచి రైతుబంధు నిధుల విడుదల

సంక్రాంతి వరకు పూర్తి చేయాలని సీఎం ​ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: యాసంగి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయాలని రాష్ట్ర సర్కార్​ నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్​ ఆదేశించారు. రైతు బంధు నిధులను ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభించి సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. మొత్తం రూ.7,600 కోట్లను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. 

ఈ మేరకు సర్కారు ఆదివారం ఒక ప్రకటన రిలీజ్​ చేసింది. పలు మార్గాలనుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.40 వేల కోట్లను కేంద్రం తొక్కిపెట్టిందని అందులో పేర్కొంది. ఎలాంటి కోతలు లేకుండా, రైతులందరికీ పూర్తి స్థాయిలో, సకాలంలో రైతు బంధు నిధులు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రటరీకి సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.