వరద నీటిలోకి కెమికల్స్​.. వేలాదిగా చనిపోయిన చేపలు

వరద నీటిలోకి కెమికల్స్​.. వేలాదిగా చనిపోయిన చేపలు
  • గండిగూడెం చెరువులో వేలాదిగా చనిపోయిన చేపలు
  • లక్షల ఆదాయం కోల్పోయామని మత్స్యకారుల ఆవేదన 

రామచంద్రాపురం, వెలుగు :మూడ్రోజులుగా కురుస్తున్న వానలు  కెమికల్​ కంపెనీలకు వరంగా మారుతున్నాయి.  కెమికల్​ఇండస్ర్టీస్​లోని ప్రమాదకరమైన వేస్ట్​ కెమికల్స్​ను ట్రీట్​మెంట్ ప్లాంట్లకు పంపాల్సి ఉండగా, వరద ప్రవాహంలో కలిపి స్థానికంగా ఉండే చెరువులు, కుంటల్లోకి వదులుతున్నారు.  దీంతో ఆ చెరువుల్లోని వేలాది చేపలు మృత్యువాత పడ్తున్నాయి. 

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం దయారా గ్రామపంచాయతీ పరిధిలోని గండిగూడెం చెరువులో గురువారం పరిశ్రమలు వదిలిన కెమికల్స్​ వల్ల వేల సంఖ్యలో చేపలు చనిపోయాయి.  బొల్లారం, బొంతపల్లి ఇండస్ర్టీయల్​ ఏరియాల నుంచి కెమికల్స్ వదలడం వల్లే  చేపలు చనిపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.  

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా పీసీబీ ఆఫీసర్లు గాని, స్థానిక లీడర్లుగాని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాన పడిందంటే గొలుసు కట్టు చెరువులకు వేస్ట్​ కెమికల్స్​ వదులుతున్నారని, ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.  రూ. 50 లక్షలకుపైగా ఆదాయం కోల్పోయామని తమకు న్యాయం చేసి ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.