రిలయన్స్ రిటైల్ చర్చలు.. రూ.7,500 కోట్లకు డీల్ !

రిలయన్స్ రిటైల్ చర్చలు.. రూ.7,500 కోట్లకు డీల్ !

కోల్‌‌కతా: రిలయన్స్ రిటైల్ వాటాలను అమ్మేందుకు అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ సిల్వర్ లేక్‌‌తో చర్చిస్తోంది. సంస్థలో 1.7–1.8 శాతం వాటాలను రూ.7,500 కోట్లకు అమ్మేందుకు సిల్వర్‌‌‌‌ లేక్‌‌తో ముకేశ్ అంబానీకి చెందిన కంపెనీ రిలయన్స్ రిటైల్ చర్చిస్తోందని ఇద్దరు సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌‌లు చెప్పారు. ఫండ్స్ సేకరించేందుకు రిలయన్స్ రిటైల్ చేపడుతోన్న తొలి డీల్ ఇదే కావడం విశేషం. ఒకవేళ డీల్ కుదిరితే, రిలయన్స్ రిటైల్ విలువ రూ.4.3 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. రిలయన్స్ రిటైల్‌‌లో మైనార్టీ వాటాలను అమ్మడం ద్వారా ఫండ్స్‌‌ను సేకరించాలని ముకేశ్ అనుకుంటున్నారని ఎగ్జిక్యూటివ్‌‌లు చెప్పారు. దీని కోసం పలువురు ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నట్టు పేర్కొన్నారు. దీనిపై రిలయన్స్ రిటైల్ అధికార ప్రతినిధిని సంప్రదించగా.. మీడియా ఊహాగానాలు, రూమర్లపై తాము కామెంట్ చేయమని చెప్పారు. సిల్వర్ లేక్‌‌ కూడా దీనిపై కామెంట్ చేయడానికి నిరాకరించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ముకేశ్ అంబానీ తన డిజిటల్ బిజినెస్ జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌పై వాటాలను అమ్మడం ద్వారా 13 మంది గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి 20 బిలియన్ డాలర్లను సేకరించారు. ఈ ఇన్వెస్టర్లలో సిల్వర్ లేక్ కూడా ఉంది. ఈ కంపెనీ జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌లో రూ.10,202 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌లో ఇన్వెస్టర్లకు రిలయన్స్ రిటైల్‌‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇదొక అవకాశంగా ఉంది. రిలయన్స్ రిటైల్ దేశంలోనే అతిపెద్ద రిటైల్ చెయిన్. ఇటీవలే ఫ్యూచర్ గ్రూప్‌‌కు చెందిన రిటైల్ అసెట్లను ఇది కొనుగోలు చేసింది.