రిలయన్స్ డిఫెన్స్‎కు జాక్ పాట్.. జర్మనీ కంపెనీ నుంచి రూ.600 కోట్ల ఆర్డర్‌‌‌‌

రిలయన్స్ డిఫెన్స్‎కు జాక్ పాట్.. జర్మనీ కంపెనీ నుంచి రూ.600 కోట్ల ఆర్డర్‌‌‌‌

న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ బుధవారం జర్మన్ రక్షణ, మందుగుండు సామగ్రి తయారీ కంపెనీ రీన్‌‌‌‌మెటాల్ వాఫే మునిషన్ నుంచి రూ. 600 కోట్ల విలువైన ఎగుమతి ఆర్డర్‌‌‌‌ను పొందినట్లు తెలిపింది. అమ్యునిషన్ విభాగంలో అతిపెద్ద ఆర్డర్లలో ఇదీ ఒకటని కంపెనీ పేర్కొంది. డిఫెన్స్, అమ్యునిషన్​సప్లై చెయిన్‎లో నమ్మకమైన భాగస్వామిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలన్న వ్యూహంలో ఈ ఆర్డర్ కీలక మైలురాయని రిలయన్స్ డిఫెన్స్ తెలిపింది. 

రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ అనిల్ అంబానీ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం భారతదేశానికి అత్యాధునిక సామర్థ్యాలను తీసుకువస్తుందని,  దేశ ప్రైవేట్ రక్షణ తయారీ రంగానికి కీలకమవుతుందని అన్నారు.  ధీరూభాయ్ అంబానీ డిఫెన్స్ సిటీ (డీఏడీసీ)లో పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి,  చిన్న ఆయుధాల తయారీ కోసం ఫెసిలిటీని ఏర్పాటు చేస్తామని రిలయన్స్ డిఫెన్స్ పేర్కొంది.  మహారాష్ట్రలోని రత్నగిరిలోని వాటాడ్ పారిశ్రామిక ప్రాంతంలో ఇది ఏర్పాటవుతుంది.