పాశమైలారంలో శిథిలాల తొలగింపునకు మరో రెండు రోజులు .. ఎస్పీ నేతృత్వంలో పనిచేస్తున్న రెస్క్యూ టీం

పాశమైలారంలో శిథిలాల తొలగింపునకు మరో రెండు రోజులు .. ఎస్పీ నేతృత్వంలో  పనిచేస్తున్న రెస్క్యూ టీం
  • హెల్ప్ లైన్, హెల్ప్ డెస్క్ ద్వారా సహాయక చర్యలు

సంగారెడ్డి, వెలుగు:  పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంపై జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడుతోంది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై సమన్వయం చేసేందుకు అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు.  రెండు రోజులపాటు పూర్తిస్థాయిలో శిథిలాల తొలగింపు కొనసాగే అవకాశం ఉంది. 

ఇప్పటివరకు 18 మృతదేహాలను గుర్తించగా, మరో 20 మృతదేహాలను గుర్తించేందుకు రక్తసంబంధీకుల బ్లడ్ శాంపిల్స్ తీసుకుని డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి డెడ్ బాడీలను అప్పగించనున్నారు. మృతదేహాలను వెలికి తీసే క్రమంలో మూడు రోజులుగా వర్షం అడ్డంకిగా మారింది. దాంతో సహాయక చర్యల్లో ఇబ్బందులు తలెత్తాయి. సంగారెడ్డి కలెక్టరేట్ హెల్ప్ లైన్, సంఘటన స్థలం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి బాధిత కుటుంబ సభ్యులకు సాయం చేస్తున్నారు.

శాఖల వారీగా

రెవెన్యూ శాఖ నుంచి నాలుగు డివిజన్లకు చెందిన ఆర్డీవోలు, ఐదుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్ డివిజన్లకు చెందిన తహసీల్దార్ లు పరిస్థితిని సమీక్షించి బాధితులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి డీఎం అండ్ హెచ్ ఓ గాయత్రి, డిప్యూటీ డీఎం హెచ్ ఓలు, ఇతర మెడికల్ అధికారులతో కూడిన బృందం పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిలో గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

సీహెచ్ఓ టీమ్ కూడా తక్షణ వైద్య సేవలందించేందుకు కృషి చేస్తోంది. మున్సిపాలిటీల విభాగం నుంచి ఇస్నాపూర్, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్లు తమ బృందాలతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీపీఓ సాయిబాబా, 10 మంది ఎంపీడీవోలు, ఎంపీఓలు సైతం సహయక చర్యలు చేపట్టారు. పోలీస్ శాఖ, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, అగ్నిమాపక శాఖ ప్రత్యేక రిస్క్ టీంలు కూడా శ్రమిస్తున్నాయి.