- ఏటా రెండు సార్లు నిర్వహించేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్
- సాధారణంగా జరిగే రెండింటికి ఇవి అదనం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)ను ఇకపై ప్రతి ఏటా రెండు సార్లు స్పెషల్ గా నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రెగ్యులర్ గా నిర్వహించే రెండు టెట్ పరీక్షలకు అదనంగా, కేవలం ఇన్ సర్వీస్ టీచర్ల కోసమే వీటిని నిర్వహించనున్నట్టు ప్రకటించారు. సర్వీసులో ఉండి ప్రమోషన్లు పొందాలన్నా, సర్వీస్ కొనసాగాలన్నా.. టీచర్లకు టెట్ క్వాలిఫైని సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. అయితే, టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని కొంతకాలంగా టీచర్లు కోరుతున్నారు. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డితో పాటు ఇతర సంఘాలు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించాయి. టీచర్ల సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం.. సాధారణంగా నిరుద్యోగుల కోసం నిర్వహించే రెండు టెట్ పరీక్షలతో సంబంధం లేకుండా, ఇన్ సర్వీస్ టీచర్ల కోసం అదనంగా రెండు స్పెషల్ టెట్ లు నిర్వహించాలని నిర్ణయించింది.
త్వరలో షెడ్యూల్..
స్పెషల్ టెట్ నిర్వహణకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోనుంది. త్వరలోనే నోటిఫికేషన్, షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు. కాగా, రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న టెట్ ఎగ్జామ్ కోసం 28,149 మంది ఇన్ సర్వీస్ టీచర్లు అప్లై చేసుకున్నారు. వీరిలో పేపర్ 1 కోసం 7,678 మంది ఉండగా, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కు 11,343 మంది, సోషల్ స్టడీస్ కోసం 9,128 మంది ఉన్నారు.
టీచర్ల సంఘాల హర్షం
ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహణపై టీచర్ల సంఘాలు హర్షం ప్రకటించాయి. సీఎం రేవంత్ రెడ్డికి, విద్యాశాఖ అధికారులకు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందంగౌడ్, జుట్టు గజేందర్, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, వెంకట్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేష్, అంజిరెడ్డి, పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య ధన్యవాదాలు చెప్పారు. టెట్ సిలబస్ మార్చాలని కోరారు.
