వరద ముంపులో ఆదిలాబాద్ జిల్లా.. పెన్ గంగ ఉగ్రరూపం.. వరద నీరు మరొక మూడు ఫీట్లు పెరిగితే..

వరద ముంపులో ఆదిలాబాద్ జిల్లా.. పెన్ గంగ ఉగ్రరూపం.. వరద నీరు మరొక మూడు ఫీట్లు పెరిగితే..

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగ ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. జాతీయ రహదారిపై బ్రిడ్జికి సమీపంలో ప్రవహిస్తుండటంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరొక మూడు ఫీట్ల వరద నీరు పెరిగితే వరద నీరు బ్రిడ్జి మీదగా ప్రవహించే అవకాశం లేకపోలేదు. రెండు వైపులా నది నేషనల్ హైవేకు ఆనుకోని ప్రవహిస్తుండటంతో వరద ప్రవాహం గోదావరిని మరిపించేలా ఉంది.

డోలరా, పెండల్ వాడ  గ్రామాల్లో ‌పెన్ గంగ వరద నీరు పంటలను ముంచేసింది. వరదనీటితో పత్తి, సోయా పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఐదు వందల ఎకరాల్లో పంటలు మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్ జిల్లా చెనాక కొరాట బ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. రెండు, మూడు గేట్లు ఎత్తి వరద నీళ్లను అధికారులు దిగువకు విడుదల చేశారు. దిగువ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ములుగు జిల్లాలో గోదావరి నది వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుంది. మూడవ ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి ప్రవాహం చేరింది. ఏటూరు నాగారం మండలం రామన్న గూడెం దగ్గర 16.2 మీటర్లకు వరద ప్రవాహం చేరుకుంది. దీంతో.. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 17.32 మీటర్లకు చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపంలో ప్రవహిస్తుంది. పుష్కర ఘాట్లను తాకుతూ 12,210 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లోకి వరద భారీగా పోటెత్తింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 6 లక్షల 79వేల పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ప్లో ఔట్ ఫ్లో 6,79,910 క్యూసెక్కులు. లక్ష్మీ బ్యారేజ్ పూర్తి స్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసీలు.