మీకు బెంగళూరులో ప్రాపర్టీ ఉందా..? ఐతే మీకే ఈ గుడ్‌న్యూస్..

మీకు బెంగళూరులో ప్రాపర్టీ ఉందా..? ఐతే మీకే ఈ గుడ్‌న్యూస్..

Bengaluru News: ఐటీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్న బెంగళూరులో లక్షల మంది ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడుతుంటారు. ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అసవరాలతో అక్కడికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వెళ్లినవారు అక్కడే సొంతిల్లు కొనుక్కుని స్థిరపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ నుంచి వేల సంఖ్యలో టెక్ ఉద్యోగులు అక్కడ అపార్ట్మెంట్లు కూడా కొనుక్కుంటున్నారు. అయితే తాజాగా వచ్చిన మార్పుల గురించి వీరు తప్పక తెలుసుకోవాల్సిందే. 

ప్రస్తుతం బెంగళూరు నగరంలో ఆస్థిని కలిగి ఉన్న వ్యక్తులు తమ ఇ-ఖాతా సర్టిఫికెట్లను పొందటానికి మున్సిపల్ ఆఫీసుల చుట్టూ ఇకపై తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భృహత్ బెంగళూరు మహా పాలికే ఇందుకోసం ఇ-ఆస్తి పేరుతో ఒక ఫ్లాట్ ఫారమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రజలు ఇళ్ల నుంచే ఆన్ లైన్ విధానంలో ప్రక్రియను పూర్తి చేసి తమ ఇ-ఖాతా సర్టిఫికెట్లను పొందవచ్చని వెల్లడించింది. రోజంతా బిజీ లైఫ్ లో అత్యంత రద్దీ రోడ్లపై ప్రయాణించి మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగే కష్టాన్ని ఈ సౌకర్యం తీర్చనుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

అసలు ఏంటి ఈ ఇ-ఖాతా అంటే..? 
ఇ-ఖాతా అనేది సాంప్రదాయంగా అందించే ఖాతా సర్టిఫికెట్లకు డిజిటల్ వెర్షన్. ఇది అధికారికంగా ఆస్తి యాజమాన్యాన్ని నమోదు చేస్తుంది. అలాగే సదరు ప్రక్రియ మున్సిపాలిటీ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. ఆస్తి నిర్వహణ, పన్ను చెల్లింపులు, చట్టపరమైన ధృవీకరణను సులభతరం చేస్తుంది.

ఎలా దరఖాస్తు చేయాలి..
మీరు అవసరమైన అన్ని పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోండి:
* రిజిస్టర్డ్ సేల్ డీడ్ లేదా టైటిల్ డీడ్
* అమ్మకపు దస్తావేజు రిజిస్ట్రేషన్‌కు ఒక రోజు ముందు నుండి ఇప్పటి వరకు ఉన్న కాలాన్ని కవర్ చేసే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (EC)
* గత 3–5 సంవత్సరాల ఆస్తి పన్ను రసీదులు
* BBMP, BDA లేదా సంబంధిత అధికారం నుండి ఆమోదించబడిన భవన ప్రణాళిక లేదా లేఅవుట్ అనుమతి
* ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (కొత్త నిర్మాణాలకు)
మునుపటి ఖాటా సర్టిఫికేట్ (అందుబాటులో ఉంటే)
* ఆస్తి యజమాని ఆధార్, పాన్ వివరాలు
* చిరునామా రుజువు 
* యజమానితో పాటు సదరు ఆస్తి ఫోటోలు
* బెస్కామ్ కనెక్షన్ నంబర్
* ఆస్తి GPS కోఆర్డినేట్‌లు
* వర్తిస్తే.. బ్యాంక్ లేదా హౌసింగ్ సొసైటీ నుంచి NOC

ఈ ప్రక్రియను స్టార్ట్ చేయటానికి యూజర్లు అధికారిక వెబ్ సైట్ bbmpeaasthi.karnataka.gov.in ఉపయోగించాలి. ఇందులో మెుబైల్ నంబర్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుని ప్రక్రియను ప్రారంభించవచ్చు. అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయటంతో పాటు పన్ను వివరాలను పూరించాల్సి ఉంటుంది. ఇందుకోసం నామమాత్రపు రుసుము రూ.40 చెల్లిస్తే సరిపోతుంది. ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మీకు ట్రాకింగ్ ఐడి మెయిల్ లేదా మెసేజ్ రూపంలో పొందుతారు. అందించిన వివరాలను పరిశీలించిన తర్వాత అధికారులు 48 గంటల్లో ఇ-ఖాతా సర్టిఫికెట్ జారీ పూర్తి చేస్తారు.