- హిందువులను కించపరిచేలా సోషల్ మీడియాలో ముస్లింల వీడియో
- కోపోద్రిక్తులై మసీదును కూల్చివేసిన స్థానికులు
- హిందూ సంఘాలు, ముస్లింలు పోటాపోటీగా ర్యాలీలు
- ఆందోళనకారులపై పోలీసుల టియర్ గ్యాస్
ఖాట్మాండు: నేపాల్ లోని పలు ప్రాంతాల్లో మతపరమైన ఆందోళనలు చోటుచేసుకున్నాయి. హిందువులను కించపరుస్తూ ఇద్దరు ముస్లింలు గతవారం టిక్ టాక్ లో ఓ వీడియో పోస్టు చేశారు. వీడియో వెలుగులోకి రావడంతో ధనూషా జిల్లాలోని కమలా మున్సిపాలిటీలో స్థానికులు కోపోద్రిక్తులై ఓ మసీదును కూల్చివేశారు.
వీడియో అప్ లోడ్ చేసిన ఆ యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ పర్సా జిల్లాలోని బిర్ గంజ్ సిటీలో మంగళవారం హిందూ సంఘాలతో పాటు హిందువులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.
హిందూ దేవతలను అవమానించేలా వీడియో ఉందని, దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో మతసామరస్యాన్ని, శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేలా వీడియో ఉందని పేర్కొన్నారు. ముస్లింలు కూడా రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు చేశారు. ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు.
దీంతో పరిస్థితి క్రమంగా ఉద్రిక్తతకు దారితీసింది. కొంతమంది ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ ను కూడా ధ్వంసం చేశారు. పరిస్థితి చేయిదాటి పోతుండడంతో నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. బిర్ గంజ్ సిటీలో కర్ఫ్యూ విధించారు.
భారత్, నేపాల్ సరిహద్దులు బంద్
నేపాల్లో ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఆ దేశ సరిహద్దులను భారత ప్రభుత్వం పూర్తిగా మూసివేసింది. ఉద్రిక్తతలు చోటుచేసుకున్న పర్సా, ధనూషా జిల్లాలు భారత్కు ఆనుకుని ఉన్నాయి. దీంతో ఇరు దేశాల నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. రాకపోకలు జరగకుండా సహస్ర సీమా బళ్ బలగాలు కాపలా కాస్తున్నాయి. ఎమర్జెన్సీ సర్వీసులను మాత్రం మినహాయించారు. మైత్రి బ్రిడ్జిపై ప్రత్యేక నిఘా ఉంచారు.
