మంచి కంటెంట్ అయితే.. రీమేక్ అయినా పర్వాలేదు : చిరంజీవి

మంచి కంటెంట్ అయితే.. రీమేక్ అయినా పర్వాలేదు : చిరంజీవి

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్‌‌‌‌లో రూపొందిన మాస్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్ ‘భోళా శంకర్’. ఏకే ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై తెరకెక్కిన ఈ మూవీ  ఆగస్టు 11న విడుదలవుతోంది. ఆదివారం హైదరాబాద్‌‌లోని శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ఏ సినిమా అయినా  నాకు నచ్చితేనే చేస్తాను. అలాగే ఈ సినిమా నాకు నచ్చింది  కాబట్టే చేశాను.  రీమేక్‌‌లు ఎందుకు చేస్తారని కొందరు అడుగుతున్నారు. ఇతర భాషల్లో ఉన్న మంచి కంటెంట్‌‌ను తెలుగు ప్రేక్షకులకు చూపించడంలో తప్పులేదు. ఇది ‘వేదాళం’కు రీమేక్ అయినా ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌‌లో లేదు కాబట్టే నేను చేశాను.  

ప్రతిరోజూ సెట్‌‌లో హుషారుగా ఉండటానికి కో యాక్టర్సే కారణం. తమన్నా, కీర్తి సురేష్​ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కారణమే. మెహర్‌‌‌‌ రమేష్ ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశాడు. సుశాంత్ మంచి రోల్ చేశాడు. కీర్తి సురేష్ మంచి పెర్ఫార్మర్. ఈ సినిమా వీరయ్యను మించి పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నా.  ఇక.. మా లాంటి పాత తరమే కాదు.. కొత్త తరం వస్తేనే ఇండస్ట్రీ మరింత ముందుకు వెళ్తుంది. టాలెంట్‌‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇండస్ట్రీ జీవితాన్ని ఇస్తుంది. ఇండస్ట్రీ అనేది పుష్పక విమానం లాంటిది. ఎంత మంది వచ్చినా కళామతల్లి అక్కున చేర్చుకుంటుంది. ఇండస్ట్రీకి వచ్చే వారిని ప్రోత్సహించండి.  ‘ఈ ఇండస్ట్రీ ఏ ఒక్కరిదో కాదు.. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇక్కడ స్థానం ఉంటుంది’ అని ఈ మధ్యన పవన్ కళ్యాణ్​ చెప్పిన మాట వాస్తవం. 

అందుకే మా ఇంట్లో ఎంతమంది హీరోలు ఉన్నా వాళ్లని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చెయ్యం. ఏ బ్యాక్‌‌గ్రౌండ్ లేకుండా వచ్చే  కొత్త వారిని మాత్రం ఎప్పుడూ సపోర్ట్ చేయడానికి ముందుంటాను’ అన్నారు. కార్యక్రమానికి హాజరైన నిర్మాతలు అల్లు అరవింద్, ఏ.ఎం.రత్నం, టీజీ విశ్వ ప్రసాద్, ఎస్‌‌కెఎన్, దర్శకులు బాబీ, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, సంపత్ నంది, బుచ్చిబాబు సానా సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. చిరంజీవి గారి దగ్గర నుంచి యంగ్ స్టర్స్ అందరూ చాలా విషయాలు నేర్చుకోవాలి అంది కీర్తి సురేష్. సుశాంత్ మాట్లాడుతూ ‘మా జనరేషన్ యాక్టర్స్‌‌కి మెగాస్టార్‌‌‌‌తో స్ర్కీన్ షేర్ చేసుకోవడం రేర్‌‌‌‌గా దొరుకుతుంది. ఇందులో చిరు గాలిలా నేనూ పార్ట్ అవడం హ్యాపీ’ అన్నాడు. 

మెహర్ రమేష్ మాట్లాడుతూ ‘అన్నయ్యతో సినిమా చేయడం ఈ జన్మలో నేను చేసుకున్న అదృష్టం. దర్శకుడిగా నాకిది పునర్జన్మ లాంటిది. మెగాఫ్యాన్స్‌‌ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’ అని చెప్పాడు.  అనిల్ సుంకర మాట్లాడుతూ ‘చిరంజీవి గారితో సినిమా చేయడం లైఫ్ టైమ్ అచీవ్‌‌మెంట్.  నా కల నిజం చేసిన మెహర్ రమేష్‌‌కి థ్యాంక్స్’ అని చెప్పారు.  నటులు రాజా రవీంద్ర, సురేఖ వాణి, శ్రీముఖి, గెటప్ శ్రీను, హైపర్ ఆది, వేణు,  ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, డివోపీ డడ్లీ, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్, లిరిసిస్టులు రామ జోగయ్య శాస్త్రి,  కాసర్ల శ్యామ్, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, రేవంత్, అనురాగ్ కులకర్ణి పాల్గొన్నారు.