రీమేక్ రిస్క్ కాదు.. టాస్క్ : మెహర్ రమేష్

రీమేక్ రిస్క్ కాదు.. టాస్క్  : మెహర్ రమేష్

చిరంజీవి గారి సినిమాని డైరెక్ట్ చేయడంతో తన కల నేరవేరిందన్నాడు దర్శకుడు మెహర్ రమేష్. చిరంజీవి హీరోగా తను రూపొందించిన ‘భోళా శంకర్’ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మెహర్ రమేష్​  చెప్పిన విశేషాలు. ‘‘చిన్నప్పటి నుంచి అన్నయ్యని, ఆయన సినిమాలని చూస్తూ పెరిగా. అన్నయ్య ని డైరెక్ట్ చేయడం ఒక డ్రీమ్. నేను డైరెక్టర్ అయ్యింది ఈ సినిమా చేయడానికేమో  అనిపిస్తుంది. చిరంజీవి గారు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశారు.  రీమేక్  అయినప్పటికీ ఒరిజినల్‌‌‌‌కి దాదాపు 70 శాతం మార్పులు చేశాం. 

రీమేక్‌‌‌‌ విషయంలో రిస్క్ కంటే టాస్క్ ఎక్కువ ఉంటుంది.  పెద్ద సక్సెస్ అయినదానిని  కరెక్ట్‌‌‌‌గా తీయడంతో పాటు జనాలకు నచ్చేలా తీయాలి. అలాగే తెలుగు  ప్రేక్షకులకు నచ్చేలా ప్రజంట్ చేశాం.  యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ మెంట్‌‌‌‌తో  పాటు బ్రదర్ సిస్టర్ ఎమోషన్ ఉన్న కథ ఇది. చిరంజీవి గారి ఇమేజ్‌‌‌‌కి తగ్గట్టు మార్పులు చేశాం. సెకండ్ హాఫ్ చిరంజీవి గారికి ఇచ్చిన ట్రీట్.. కంప్లీట్ డిఫరెంట్‌‌‌‌గా ఉంటుంది.  

ఈ కథలోని ఎమోషన్‌‌‌‌కి  కీర్తి సురేష్   చాలా కనెక్ట్ అయ్యింది.  సిస్టర్ సెంటిమెంట్  హైలైట్‌‌‌‌గా ఉంటుంది. అలాగే తమన్నా, సుశాంత్‌‌‌‌ల పాత్రలు కూడా చాలా చక్కగా కుదిరాయి. మహతి స్వర సాగర్ మా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. విడుదలైన పాటలన్నింటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది.  సినిమాలపై  ప్యాషన్  ఉన్న ప్రొడ్యూసర్ అనిల్ సుంకర. చిరంజీవి గారిపై అభిమానంతో  ఆయన ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని  నిర్మించారు’’.