రూ 1లక్ష ఇస్తే బ్లాక్‌లో రెమ్‌డెసివర్ ఇంజక్షన్ 

V6 Velugu Posted on Apr 20, 2021

  • కంపెనీ రేటు రూ.20 వేలు.. బ్లాక్‌‌‌‌లో రూ.లక్ష వరకూ అమ్మకం
  • కృత్రిమ కొరత సృష్టించి జనాన్ని దోచుకుంటున్న  ఫార్మా బ్రోకర్లు..
  • ఇంజక్షన్ల తయారీ కంపెనీ ఉద్యోగుల హ్యాండ్
  • హాస్పిటళ్లలో స్టాక్‌‌‌‌ లేక.. కంపెనీ ఔట్‌‌‌‌లెట్లకు కరోనా పేషెంట్ల బంధువుల క్యూ
  • రాష్ట్రమంతటి నుంచీ సిటీకి జనం.. కూకట్​పల్లి ఔట్ లెట్ దగ్గర తోపులాట

హైదరాబాద్/కూకట్‌‌‌‌పల్లి, వెలుగు: కరోనాతో బాధపడుతున్న వారి కండీషన్ సీరియస్ అయిన టైమ్‌‌‌‌లో ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు డిమాండ్ పెరగడంతో కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. హాస్పిటళ్లకు కూడా సరిపడా స్టాక్ అందకుండా బ్లాక్ మార్కెట్‌‌‌‌లో అమ్ముకుంటూ ఫార్మా బ్రోకర్లు దోపిడీకి పాల్పడుతున్నారు. రూ.20 వేల నుంచి 30 వేల మధ్య ఉండే ఆరు డోసుల వయల్​ను రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ అమ్ముతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బల్క్‌‌‌‌గా కంపెనీల నుంచి స్టాక్ తీసుకుని, సామాన్యులకు దక్కకుండా చేస్తున్నారు. ఈ పని చేస్తున్న వారిలో రెమ్డెసివిర్ ఇంజక్షన్ తయారీ కంపెనీల ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిసింది.  ప్రాణాల మీదకు వచ్చిన సమయంలో ఇష్టానుసారం రేటు చెప్పి, ఒక్కో దళారీ లక్షల్లో దండుకుంటున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్‌‌‌‌కు...
కరోనా కేసులు భారీగా పెరగడం, సింప్టమ్స్‌‌‌‌ కూడా గతంలో లాగా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి లేకపోవడంతో గుర్తించడం ఆలస్యమై ఆస్పత్రిలో చేరేసరికే సీరియస్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనిని అవకాశంగా మలుచుకుని కొందరు ఫార్మా బ్రోకర్లు ఇంజక్షన్లను భారీగా బ్లాక్ చేస్తున్నారు. చాలా చోట్ల కరోనా ఆస్పత్రులకు కూడా సరిపడా స్టాక్ అందకపోవడంతో సీరియస్‌‌‌‌గా ఉన్న పేషెంట్ల బంధువులకు కూడా డాక్టర్లు బయట ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు. దీంతో కరోనా రోగుల కుటుంబసభ్యులు, బంధువులు రెమ్డెసివిర్ ఇంజక్షన్ తయారు చేస్తున్న కంపెనీల ఔట్‌‌‌‌లెట్లకు క్యూ కడుతున్నారు. ఒక్క హైదరాబాద్‌‌‌‌లోని వారే కాక, రాష్ట్రం నలుమూలల నుంచి జనం కూకట్‌‌‌‌పల్లిలో ఉన్న హెటిరో కంపెనీ ఔట్‌‌‌‌లెట్‌‌‌‌ వద్దకు చేరుకుంటున్నారు. 
కంపెనీ ఔట్‌‌‌‌లెట్‌‌‌‌లోనూ దొరకట్లే
రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి సిటీలో పడిగాపులు పడుతున్నా ఇంజక్షన్లు దొరకడం లేదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఔట్‌‌‌‌లెట్‌‌‌‌లో ఇంజక్షన్లు అమ్ముతామని అక్కడ బోర్డు పెట్టినా, స్టాక్ ఎంత మాత్రం వస్తుందోనన్న భయంతో పేషెంట్ల బంధువులు ఉదయం 6 గంటల నుంచే క్యూలైన్‌‌‌‌లో నిల్చుంటున్నారు. కానీ కంపెనీ వాళ్లు సోమవారం మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత ఎప్పుడో ఓపెన్ చేశారు. అది కూడా రెండు మూడు గంటలకు ఒకసారి 50 ఇంజక్షన్లకు మించి తేవడం లేదు. దీంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు శనివారం నుంచి ఇక్కడే పడిగాపులు గాస్తున్నా రెమ్డెసివిర్ ఇంజక్షన్ దొరకడం లేదు. సోమవారం జనం వందల సంఖ్యలో ఇంజక్షన్ కోసం రావడంతో తోపులాట జరిగింది. అక్కడ ఉన్న వారికి సరిపడా ఇంజక్షన్లు రాకపోవడంతో జనం ఔట్‌‌‌‌లెట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒక దశలో కూకట్‌‌‌‌పల్లి పోలీసులు అక్కడికి చేరుకుని జనానికి సర్ది చెప్పాల్సి వచ్చింది.
ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి
కరోనా వచ్చిన వారికి సీరియస్ అయిన టైమ్‌‌‌‌లో డాక్టర్లు ఆరు డోసుల రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఇస్తున్నారు. ఇంజక్షన్​తయారీ కంపెనీలు కూడా 6 డోసుల వయల్‌‌‌‌నే అమ్ముతున్నాయి. ఇది కంపెనీ ఔట్‌‌‌‌లెట్‌‌‌‌ దగ్గర రూ.20,400కు దొరుకుతోంది. అయితే దీనిని డిస్ట్రిబ్యూటర్లు, షాపుల్లో రూ.30 వేల వరకు అమ్ముతున్నారు. అయితే కంపెనీల్లో ఉత్పత్తి అవుతున్న ఇంజక్షన్లను మార్కెట్‌‌‌‌లోకి రానీయకుండా కొంత మంది ఆ కంపెనీల ఉద్యోగులు, బ్రోకర్లు డైరెక్ట్‌‌‌‌గా వేల సంఖ్యలో ఇంజక్షన్లు బ్లాక్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రూ.40 వేల నుంచి డిమాండ్‌‌‌‌ను బట్టి లక్ష రూపాయల వరకూ అమ్ముతున్నారని తెలుస్తోంది. కరోనా రోగులకు అవసరమైన ఈ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌‌‌‌లోకి వెళ్లనీయకుండా ఆస్పత్రులు, మెడికల్ స్టోర్స్‌‌‌‌లో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సీరియస్ చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

బ్లాక్‌‌‌‌లో అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్
రెమ్డెసివిర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను నార్త్ జోన్‌‌‌‌ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.2.5 లక్షల విలువ చేసే 12 రెమ్డెసివిర్ ఇంజక్షన్ వయల్స్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌‌‌‌పల్లి బాలాజీనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన షఖీల్‌‌‌‌ సలీమ్‌‌‌‌ జప్ఫర్‌‌‌‌‌‌‌‌(32) హెటిరో హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌లో ఏరియా బిజినెస్‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీ ఫీల్డ్‌‌‌‌ సేల్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న బత్తల వెంకటేశ్‌‌‌‌(27)తో కలిసి రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ చేసేందుకు ప్లాన్ చేశారు. కంపెనీ నుంచి ఇంజక్షన్లను తెచ్చి, అల్కెమ్‌‌‌‌ ఫార్మసీకి చెందిన మెడికల్‌‌‌‌ రిప్రెజెంటెటివ్‌‌‌‌ జొన్నల శ్రవణ్‌‌‌‌ సాయి(26)తో బేగంపేట్‌‌‌‌లోని హైదరాబాద్‌‌‌‌ పబ్లిక్‌‌‌‌ స్కూల్‌‌‌‌ వద్ద కస్టమర్లకు డెలివరీ చేయాలని ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ బ్లాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ గురించి పక్కా సమాచారం ఉండడంతో రైడ్ చేసి ఆ ముగ్గురినీ అరెస్టు చేశామని నార్త్‌‌‌‌ జోన్ టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.
మా నాన్న కండీషన్ సీరియస్
మా నాన్న కరోనాతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకుంటున్నారు. ఆయన కండీషన్ సీరియస్‌‌‌‌గా ఉంది. రెమ్డెసివిర్ ఇంజక్షన్ ప్రస్తుతం ఆస్పత్రిలో స్టాక్ లేదని, బయట ట్రై చేయాలని డాక్టర్లు చెప్పారు. ఉదయం 6 గంటలకు కంపెనీ ఔట్‌‌‌‌లెట్ దగ్గర మా నాన్నకు సంబంధించిన అన్ని రిపోర్ట్స్‌‌‌‌తో వచ్చాను. కానీ ఇంజక్షన్ దొరకలేదు. బ్లాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో 30 వేల నుంచి 40 వేల దాకా పెడితే దొరుకుతుందని కొంత మంది చెబుతున్నారు. - శివకృష్ణ, కూకట్‌‌‌‌పల్లి 

వరంగల్ నుంచి  శనివారం వచ్చినం
మా అన్న కొడుకు కరోనాతో వరంగల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకుంటున్నడు. వాడికి రెమ్డెసివిర్ ఇంజక్షన్ కోసం నేను, నా కొడుకు శనివారం వచ్చినం. ఆ రోజంతా క్యూలో నిల్చున్నా ఇంజక్షన్ దొరకలె. కూకట్‌‌‌‌పల్లిలో ఓ హోటల్‌‌‌‌లో ఉండి, సోమవారమైనా ఇంజక్షన్‌‌‌‌ దొరుకుతదనుకుంటే లాభం లేకుండా పోయింది. ఆస్పత్రిలో మా వాడి పరిస్థితిపై టెన్షన్‌‌‌‌గా ఉంది. - నిస్సార్​ అహ్మద్​, వరంగల్
 

Tagged Telangana, corona vaccine, remdesivir injection rate, remdisiver company rate, block market, pharma brokers, artificial scarcity, rob people, cheaters arrest,   Three arrested for selling on the block, Rs.1 lakh

Latest Videos

Subscribe Now

More News