ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు గుర్తుంచుకో...

ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు గుర్తుంచుకో...
  • జనగామ జిల్లా దేవరుప్పులలో తీవ్ర ఉద్రిక్తత
  • కార్యకర్తలకు తీవ్ర గాయాలు
  • బీజేపీ లీడర్ల కార్ల అద్దాలు ధ్వంసం
  • ఘటనపై డీజీపీకి సంజయ్ ఫోన్
  • స్పందించకుంటే డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానని హెచ్చరిక
  • దాడిని ఖండించిన కిషన్​ రెడ్డి, వివేక్​ వెంకటస్వామి

జనగామ, వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ ​శ్రేణులు దాడి చేశాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో రాళ్లు, కట్టెలతో విరుచుకుపడ్డాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు దాడులకు దిగారు. ఈ సమయంలో పోలీసు బందోబస్తు పెద్దగా లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. రెండు గంటలకు పైగా ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులు తక్కువగా ఉండడంతో ఒక వైపు కంట్రోల్ చేస్తే మరో వైపు దాడులకు పాల్పడ్డారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడగా.. చికిత్స కోసం జనగామ జిల్లా హాస్పిటల్‌‌కు తరలించారు. ఎట్టకేలకు పోలీసులు చెదరగొట్టడంతో సంజయ్ యాత్ర ముందుకు సాగింది. అయితే కొద్ది దూరం వెళ్లగానే మరోసారి టీఆర్ఎస్‌‌ లీడర్లు గొడవకు దిగారు. ఈ ఘటనలో బీజేపీ లీడర్లకు చెందిన రెండు కార్ల అద్దాలను గులాబీ శ్రేణులు ధ్వంసం చేశాయి.

ప్రసంగం ప్రారంభించగానే..

సోమవారం యాదాద్రి జిల్లా గుండాల మండలం నుంచి జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రానికి బండి సంజయ్ యాత్ర చేరుకుంది. ముందుగా సాయి ప్రశాంతి హైస్కూల్‌‌లో జెండా ఆవిష్కరించిన సంజయ్.. పాదయాత్రగా దేవరుప్పుల నుంచి బయలుదేరారు. మండల కేంద్రంలోనే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడ మాట్లాడిన సంజయ్.. దేవరుప్పుల పోరాటాల పురిటిగడ్డ అని, తెలంగాణ వచ్చినా ఇక్కడ ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. ‘‘ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ వచ్చిందా? ఇంటర్​ కాలేజీ వచ్చిందా? 100 పడకల హాస్పిటల్ వచ్చిందా?’’ అని అడిగారు. తెలంగాణ కోసం 1,200 మంది బలిదానం చేసింది ఒక్క కుటుంబం కోసమా అని ప్రశ్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. ‘కేంద్రం ఏం ఇచ్చింది?’ అని ప్రశ్నించారు. దీంతో సంజయ్.. ‘‘పది మంది వచ్చి నాటకాలు జేస్తున్రా.. మీ కేసీఆర్ తెచ్చిండా తెలంగాణ.. ఇంటికో ఉద్యోగం ఇయ్యమను.. తమాషాలు జేస్తుండ్రా ఏమి’’ అంటూ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతుండగానే టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు దాడులకు దిగారు. పెద్ద పెద్ద కర్రలు, రాళ్లను చేత బట్టుకుని బండి యాత్ర వైపు దూసుకువచ్చారు. దీంతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఈ దాడులు జరుగుతుండగానే బండి సంజయ్ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.

కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నవ్

తెలంగాణ ద్రోహులను సంకలో పెట్టుకునేందుకు ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకోలేదని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తమపై రాళ్లు వేస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. టీఆర్ఎస్ గుండాలు తమను అడ్డుకుంటారని తెలిసినా.. ఇక్కడి సీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు గుర్తుంచుకో. నువ్వు సీపీవా.. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న కార్యకర్తవా? ఎవరికి కొమ్ముకాస్తున్నవ్? కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నవ్.. నీకు డ్యూటీ చేతగాకపోతే ఇంట్లో కూర్చో’’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులకు బీజేపీ వ్యతిరేకం కాదని, ఇలా సర్కారుకు కొమ్ముకాసే సీపీ లాంటి వాళ్లకే వ్యతిరేకమన్నారు. ఎవరెంత రెచ్చగొట్టినా బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని, వాళ్లు రాళ్లు వేసినా మనం పూలుగానే భావించాలని సూచించారు. 

డీజీపీకి సంజయ్ ఫోన్

దేవరుప్పుల దాడి నేపథ్యంలో బండి సంజయ్.. డీజీపీ మహేందర్‌‌‌‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. దాడి జరిగే అవకాశముందని ముందే తెలిసినా వరంగల్ సీపీ పట్టించుకోలేదని.. ఫోర్స్ ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ‘‘ఎక్కడా ఇబ్బంది కాలే.. ఇక్కడే దాడులు అయినయ్.. మేం ప్రశాంతంగా యాత్ర చేస్తున్నం.. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు పార్టీ కార్యకర్తల తలలు పగిలాయి. పది నిమిషాల్లో పరిస్థితిని కంట్రోల్ చేయకపోతే గాయపడ్డ కార్యకర్తలతో డీజీపీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతా” అని హెచ్చరించారు.