అర్నాబ్ గోస్వామి అరెస్ట్.. ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోంది

అర్నాబ్ గోస్వామి అరెస్ట్.. ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోంది

ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 53 ఏళ్ల అన్వయ్ నాయక్ అనే ఇంటీరియర్ డిజైనర్‌‌ను సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించారన్న కేసులో అర్నాబ్‌‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. అర్నాబ్ అరెస్టును ఖండించిన జవదేకర్.. ఇది ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను గుర్తు చేస్తోందన్నారు. ‘మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిని మేం ఖండిస్తున్నాం. మీడియాతో ఇలా వ్యవహరించడం సరికాదు. ఇది ఎమర్జెన్సీ నాటి రోజులను గుర్తు చేస్తోంది’ అని జవదేకర్ ట్వీట్ చేశారు.

కాగా, పోలీసులు తన ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని అర్నాబ్ గోస్వామి ఆరోపించారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. అన్వయ్ రాసిన సూసైడ్ నోట్‌‌లో అర్నాబ్ గోస్వామి సహా మరో ఇద్దరు వ్యక్తులు తనకు రావాల్సిన రూ.5 కోట్ల 40 లక్షలు చెల్లించలేదని తెలిపాడు. దీంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయని, అందుకే తాను సూసైడ్ చేసుకున్నట్లు లేఖలో అన్వయ్ నాయక్ పేర్కొన్నారు.