రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని అత్తాపూర్ లో అధికారులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. జల మండలికి కేటాయించిన 6 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు అక్రమాలను తొలగించారు. 6 ఎకరాల స్థలంలో అక్రమంగా వెలసిన 62 షెడ్డులను గుర్తించిన అధికారులు... జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను జేసీబీల సహాయంతో తొలగించారు.
అత్తాపూర్ లోని సర్వే నెంబర్స్ 507, 511, 513, 514 లతో సహా 24 ఎకరాల 20 గుంటల స్థలాన్ని అధికారులు గుర్తించారు. 6 ఎకరాల స్థలంలో షెడ్డులు వేసి ఆక్రమించుకున్న కబ్జా దారులకు... ఇంతకు మునుపు రెవెన్యూ అధికారులు పలు మార్లు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. అందులో భాగంగా అర్థరాత్రి సమయంలో అక్రమంగా వెలసిన నిర్మాణాలను సిబ్బంది నేల మట్టం చేశారు. అక్రమాల తొలగింపు ప్రక్రియను రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ, శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి దగ్గర ఉండి పర్యవేక్షించారు. అనంతరం కబ్జాకోరులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. భారీగా పోలీసులు మొహరించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
