ఏపీ ఎన్నికల సిబ్బందికి ఒక్కో జిల్లాలో ఒక్కో రెమ్యూనరేషన్

V6 Velugu Posted on Feb 13, 2021

  • తేడాపై పోలింగ్ సిబ్బంది అసంతృప్తి

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల సిబ్బందికి ఒక్కో  జిల్లాలో ఒక్కో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా విషయం గుర్తించిన పోలింగ్ సిబ్బంది అసంతృప్తి ఉన్నతాధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెనుకంజ చూపినట్లు సమాచారం. ఎలక్షన్ విధులు నిర్వహించే సిబ్బందికి ఒక్కొక్క విధంగా గౌరవ వేతనం చెల్లించడం శ్రమ దోపిడీకి గురిచేసినట్లు ఉందని పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు కర్నూలు జిల్లాలో పీవోలకు రూ. 1050 ఏపీవోలు, ఓపీవోలకు రూ.500 చొప్పున ఇస్తుంటే.. అదే శ్రీకాకుళం జిల్లాలో పీవోలకు రూ. 1400, ఏపీవోలు, ఓపీవోలకు రూ. 1000 చొప్పున ఇస్తున్నారు. ఈ మేరకు ఆయా ఎన్నికల అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఆయా జిల్లాల్లో ఉత్తర్వుల్లో తేడా చూసిన ఎన్నికల సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా వ్యత్యాసం.? చూపిస్తున్నారంటూ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఎన్నికలకు సంబంధించిన ఖర్చులకు ఆడిట్ ఉండదు కాబట్టి ఇష్టానుసారంగా చేస్తున్నారా..? అసలు ఎన్నికల నిబంధనలు ఏం చెబుతున్నాయి..? ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె. సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా కొన్ని జిల్లాలలో పీవోలు, ఏపీవోలు, ఓపీవోలుగా ఉంటే కర్నూల్ జిల్లాలో మాత్రం పీవోలు మరియు ఓపీవో లుగా మాత్రమే నియమించారని.. రెమ్యూనరేషన్ మంజూరులో కూడా తేడాలు దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.  ఇతర జిల్లాలతో పోలిస్తే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని, వీటిని నివృత్తి చేయాలని ఆయన ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు నిర్వహించే సిబ్బందికి రెమ్యూనరేషన్ ఇచ్చే విధానంలో ఒకవేళ ఏవైనా తప్పిదాలు జరిగి ఉంటే వాటిని సవరించి పనిచేసే సిబ్బందిని మోసం చేయకుండా మున్ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు కె. సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

సెలవు దినాల్లో ఎన్నికల డ్యూటీ నిర్వహించిన వారికి CCL మంజూరు చేయాలి

ఏపీలో పంచాయతీ ఎన్నికల కోసం రెండో శనివారం నాడు ఎలక్షన్ విధులు నిర్వహించే సిబ్బందికి జీవో నెంబర్ 374 ప్రకారం సీసీఎల్  మంజూరు చేయాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె. సతీష్ కుమార్  ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు టీచర్ల తరపున జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా కలెక్టర్ కు ఆయన వినతిపత్రాలు అందజేశారు. కొన్ని జిల్లాలలో పీవోలు, ఏపీవోలు, ఓపీవోలుగా ఉంటే కర్నూల్ జిల్లాలో మాత్రం పీవోలు మరియు ఓపీవోలను మాత్రమే నియమించారని, అలాగే  వారికి రెమ్యూనరేషన్ లో మంజూరులో అసమానతలు సరి చేయాలని ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల డ్యూటీకి గైర్హాజరైన సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

పంచాయతీ ఎన్నికల డ్యూటీకి చాలా చోట్ల టీచర్లు గైర్హాజరయ్యారు. మొదటి విడుతు పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గుర్తించి ఈసారి రెండో విడుత భారీ సంఖ్యలో గైర్హాజరయ్యారు. దీంత మండల కేంద్రాల్లో అందుబాటులో ఉన్న టీచర్లు, ఇతర సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకుని పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ విషయంపై కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్ తీవ్రంగా స్పందించారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులకు గైర్హాజరైన 188 మంది పి.ఓ.లను, 193 మంది ఓపిఓ లను ఎస్.ఈ.సి.నిబంధనలు, ప్రజా ప్రాతినిథ్య చట్టం -1951 నిబంధనలు, ప్రభుత్వ సీసీఏ రూల్స్ మేరకు సస్పెండ్ చేశారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇలాంటి పరిస్థితి రాకుండా పోలింగ్ సిబ్బంది గైర్హాజరు కాకుండా ఎంపిడిఓలు, తహసీల్దార్ లు, ఈఓ ఆర్డీలు,  ఆర్డీవోలు వ్యక్తిగత శ్రద్ధ పెట్టి తగిన చర్యలను తీసుకోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని వీరపాండియన్ తెలిపారు.

Tagged VIjayawada, AP, srikakulam, Amaravati, kadapa, Kurnool, Polling, District, differences, election staff, remuneration

Latest Videos

Subscribe Now

More News