రూ. 6 వేల కోట్లతో తెలంగాణలో రెన్యూసిస్ పెట్టుబడులు

రూ. 6 వేల కోట్లతో తెలంగాణలో రెన్యూసిస్  పెట్టుబడులు

తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ స్థాయి సంస్థ ముందుకొచ్చింది. రూ. 6 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్స్ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి దిగ్గజ సంస్థ రెన్యూ సిస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంతో  ఒప్పందం కుదుర్చుకుంది.  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం లోని ఫ్యాబ్ సిటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఆ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ....కర్నాటక, మహారాష్ట్రలో ఆ సంస్థకు తయారీ యూనిట్లు ఉన్నప్పటికీ అదిపెద్ద తయారీ యూనిట్ ను హైదరాబాద్ లో నెలకొల్పాలని ఆ సంస్థ నిర్ణయం సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటు చేయడానికి గానూ కావాల్సిన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. 

 ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా హైదరాబాద్ సోలార్ పరికరాల తయారీకి హబ్ గా మారుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని ప్రోత్సహిస్తుందని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్శిస్తామని తెలిపారు. అందు కోసం సమగ్ర ఇంధన పాలసీని రూపొందిస్తున్నామని ప్రకటించారు.