సనత్నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రమాదం..ఒకరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

సనత్నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రమాదం..ఒకరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
  • రెనోవేషన్ పనులు చేస్తుండగా కూలిన ప్లాట్​ఫామ్

జూబ్లీహిల్స్, వెలుగు: సనత్​నగర్​ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రమాదం జరిగింది. భవనం ఐదో అంతస్తులో రెనోవేషన్ పనులు చేస్తుండగా, సస్పెన్షన్ ప్లాట్​ఫామ్ కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. సనత్​నగర్​లోని ఈఎస్ఐ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు బ్లడ్ బ్యాంకు సమీపంలో ఐదంతస్తుల భవనానికి కొద్దిరోజులుగా రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. 

ఐదో అంతస్తులోని సస్పెన్షన్ ప్లాట్​ఫామ్ మీద నిలబడి ఐదుగురు కార్మికులు సోమవారం పనులు చేస్తున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్లాట్​ఫామ్ కూలడంతో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన భానుచందర్​(24)గా గుర్తించారు. భానుచందర్ ఇటీవలే భవన నిర్మాణ కాంట్రాక్టర్ కింద సూపర్​వైజర్​గా చేరారు. గాయపడిన మరో నలుగురికి చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. 

వీరిలో రఘుపతి, మోహన్ అనే ఇద్దరు కార్మికులకు సీరియస్​గా ఉందని ఈఎస్ఐ ఆసుపత్రి కళాశాల డీన్ శిరీష్ కుమార్ చాహన్ తెలిపారు. మల్లేశ్, మైసయ్య  ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఇదిలా ఉండగా క్షతగాత్రుల కుటుంబసభ్యులు ఆసుపత్రి ముందు రోదిస్తున్న ఘటన అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సేఫ్టీ కోసం ఏదైనా చర్యలు తీసుకుని ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదన్నారు. 

విచారణకు మంత్రి ఆదేశం

ఈఎస్‌‌ఐ హాస్పిటల్‌‌ ఘటనపై మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌‌లో మాట్లాడి వివరాలు తెలుసుకొని, విచారణకు ఆదేశించారు. ఘటనలో ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా, గాయపడిన నలుగురికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.