- నిజామాబాద్జిల్లాలో 244, కామారెడ్డి జిల్లాలో 242
- మూడు విడతల్లో పంచాయతీ పోరు
- ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగే ‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. నిజామాబాద్‌లో 244 సర్పంచ్ స్థానాలను కేటాయించగా, కామారెడ్డిలో 242 సర్పంచ్ స్థానాలను కేటాయిస్తూ ఇరు జిల్లాల కలెక్టర్లు వినయ్‌కృష్ణారెడ్డి, ఆశిష్సంగ్వాన్ గెజిట్ రిలీజ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొత్తం స్థానాల్లో రిజర్వేషన్ల పరిధి 50 శాతం దాటకుండా యంత్రాంగం పంపిన నివేదికను సర్కార్ ఆమోదించింది.
పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరనున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సబ్ కలెక్టర్/ ఆర్డీవోలు సర్పంచ్ పదవుల రిజర్వేషన్ నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు కేటాయించే పంచాయతీలను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. వార్డు రిజర్వేషన్లు మండలస్థాయిలో ఎంపీడీవోల పర్యవేక్షణలో నిర్ణయించారు. మహిళలు పోటీచేసే వార్డులు లాటరీ ద్వారా సెలెక్ట్ అయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో..
జిల్లాలో కొత్తగా 15 పంచాయతీలు ఏర్పడగా, ఇదివరకు ఉన్న 530 పంచాయతీ కలుపుకుని 545 సర్పంచ్ స్థానాలు, 5,022 వార్డులకు రిజర్వేషన్ ఖరారైంది. వంద శాతం గిరిజన జనాభాగల 71 తండాలు ఎస్టీలకు కేటాయించారు. వాటిలో 33 మహిళలకు, 38 జనరల్‌కు కేటాయించారు. నాన్ షెడ్యూల్ గ్రామాల్లో కూడా ఎస్టీ మహిళలకు 8, ఎస్టీ జనరల్‌కు 17 రిజర్వు చేశారు. రెండు కలిపితే మొత్తం 96 గ్రామ పంచాయతీలు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మిగతా వాటిలో ఎస్సీ మహిళలకు 35, ఎస్సీ జనరల్‌కు 47, బీసీ మహిళలకు 55, బీసీ జనరల్‌కు 125 పంచాయతీలు రిజర్వు అయ్యాయి. అన్ రిజర్వు కేటగిరీలో మహిళలకు113, అన్‌రిజర్వు జనరల్‌కు 242 కేటాయించారు.
వార్డుల వివరాలు..
జిల్లాలో మొత్తం 5,022 వార్డులు ఉండగా వంద శాతం గిరిజనులు ఉన్న తండాల్లోని 532 వార్డులను ఎస్టీలకు రిజర్వు చేశారు. అందులో మహిళలకు 266 వార్డులు ఉన్నాయి. నాన్ షెడ్యూల్ గ్రామాల్లో ఎస్టీ మహిళలకు 98, ఎస్టీ జనరల్‌కు 206 వార్డులు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 301, ఎస్సీ జనరల్‌కు507, బీసీ మహిళలకు 437, బీసీ జనరల్‌కు 670 వార్డులు రిజర్వు అయ్యాయి. అన్ రిజర్వుడ్ వార్డులు మహిళలకు 1,050, అన్ రిజర్వుడ్ జనరల్‌కు 1221 కేటాయించారు.
ఫస్ట్ ఫేజ్‌లో బోధన్ డివిజన్
గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదట బోధన్ డివిజన్లోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, రెంజల్, వర్ని, ఎడపల్లి, నవీపేట, పోతంగల్, సాలూరా, రుద్రూర్లో జరగనున్నాయి. సెకండ్ ఫేజ్‌లో నిజామాబాద్ డివిజన్లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, జక్రాన్‌పల్లిలో నిర్వహిస్తారు. మూడో ఫేజ్‌లో ఆర్మూర్ డివిజన్లోని ఆర్మూర్, బాల్కొండ, కమ్మర్పల్లి, భీంగల్, మోర్తాడ్, మెండోరా, నందిపేట, ముప్కాల్, ఏర్గట్ల, వేల్పూర్, ఆలూర్, డొంకేశ్వర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో మొత్తం 532 పంచాయతీల్లో మహిళలకు 242, జనరల్‌కు 290 కేటాయించారు. రిజర్వేషన్ల ప్రకారం పరిశీలిస్తే.. బీసీలకు 123లో మహిళలకు 55, జనరల్ 68, ఎస్సీలకు మొత్తం 79లో మహిళలకు 35, జనరల్ 44, , ఎస్టీలకు కేటాయించిన 90 స్థానాల్లో మహిళలకు 39, జనరల్ 51 ఉన్నాయి. జనరల్ 240 స్థానాలు కాగా మహిళలకు 113 అన్‌రిజర్వుడు 127 ఉన్నాయి.
డివిజన్ల వారీగా పరిశీలిస్తే..
కామారెడ్డి డివిజన్లో 167 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బీసీలకు కేటాయించిన 39 స్థానాల్లో మహిళలకు 17, జనరల్ 22, ఎస్సీలకు కేటాయించిన 26 స్థానాల్లో మహిళలకు 12, జనరల్ 14 , ఎస్టీలకు కేటాయించిన 30 స్థానాల్లో మహిళలకు 14, జనరల్ 16 కేటాయించారు. ఆన్‌రిజర్వుడు 63 జీపీల్లో మహిళలకు 30, జనరల్ 33 స్థానాలు దక్కాయి. బాన్సువాడ డివిజన్లో 227 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో బీసీలకు 52 స్థానాలు కేటాయించగా మహిళలకు 23, జనరల్ 29, ఎస్సీలకు 34 కేటాయించగా మహిళలకు 15, జనరల్ 19 రిజర్వ్ చేశారు. ఎస్టీలకు కేటాయించిన 31 జీపీల్లో మహిళలకు 13, జనరల్ 19 రిజర్వు అయ్యాయి. అన్ రిజర్వుడు మొత్తం 104 జీపీల్లో మహిళలకు 49, జనరల్‌కు 55 కేటాయించారు. ఎల్లారెడ్డి డివిజన్లో మొత్తం 144 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో బీసీలకు 47 స్థానాలు కేటాయించగా మహిళలకు 17, జనరల్ 30 ఉన్నాయి. ఎస్సీలకు 19 స్థానాలు కేటాయిచగా మహిళలకు 8, జనరల్ 11 రిజర్వ్ చేశారు. ఎస్టీలకు 30 రిజర్వు కాగా, మహిళలకు 14, జనరల్ 16 స్థానాలు కేటాయించారు. అన్రిజర్వుడ్మొత్తం 63లో మహిళలకు 30, జనరల్ 33 స్థానాలు దక్కాయి. దీంతో లీడర్లు భార్యలను బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు.
