నాగర్కర్నూల్ జిల్లాలో..డీఫాల్టర్లే ఎక్కువ..142 మిల్లుల్లో 101 మిల్లులు బ్లాక్ లిస్ట్లోకి

నాగర్కర్నూల్ జిల్లాలో..డీఫాల్టర్లే ఎక్కువ..142 మిల్లుల్లో 101 మిల్లులు బ్లాక్ లిస్ట్లోకి
  • అర్హుల్లో బ్యాంక్​ షూరిటీ ఇచ్చింది 30 మంది మిల్లర్లే
  • 4.50 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి అంచనా
  • కొన్న వడ్లు ఎక్కుడ నిల్వ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న ఆఫీసర్లు

నాగర్ కర్నూల్, వెలుగు:  వానాకాలంలో రైతులు పండించిన వడ్లను ఎవరికి ఇవ్వాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 142 రైస్​ మిల్లులు ఉంటే, ఇందులో 101 మిల్లులు డీఫాల్టర్​ లిస్టులో ఉన్నాయి. మిగిలిన 40 మిల్లుల్లో 30 మంది మిల్లర్లు మాత్రమే బ్యాంక్​ షూరిటీ ఇచ్చారు. గతంలో ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన వడ్లను అమ్ముకున్న 8 మంది మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. దీంతో మిగిలిన డీఫాల్టర్​ మిల్లర్లు కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో జిల్లాలో రైతులు పండించిన 4.50 మెట్రిక్​ టన్నుల వడ్లను ఎవరికీ కేటాయించాలని సంబంధిత అధికారులు ఆందోళన చెందుతున్నారు.

అడ్డగోలు దందా..

ఇన్నాళ్లు అధికారుల సహకారంతో మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన వడ్లను అమ్ముకొని సీఎంఆర్  అప్పగించకుండా అక్రమాలకు పాల్పడ్డారు. రెగ్యులర్​గా తనిఖీలు చేయాల్సి నసివిల్​ సప్లై ఆఫీసర్లు, విజిలెన్స్  ఎన్​ఫోర్స్​మెంట్​ బృందాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. గత ప్రభుత్వం హయాంలో మిల్లర్లకు కేటాయించిన వడ్లకు, ఎఫ్​సీఐకి అప్పగించిన బియ్యానికి పొంతన లేకుండా దందా నడిపించారు. మిల్లర్లకు సివిల్​ సప్లై అధికారులు తమవంతు సహకారం అందించారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్​ సర్కారు అధికారంలోకి వచ్చాక ఐదేండ్లుగా మిల్లర్లకు ఇచ్చిన వడ్లకు, వారు తిరిగి ఇచ్చిన బియ్యానికి లెక్కలు తీసి బకాయిలు చెల్లించాలని మిల్లర్లపై ఒత్తిడి చేస్తున్నారు.

ఈసారి రికార్డ్​ స్థాయిలో వడ్ల దిగుబడి..

ఈ వానాకాలం సీజన్​లో నాగర్​కర్నూల్​ జిల్లాలో రికార్డు స్థాయిలో వరి సాగు చేశారు.1.63 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 4.50 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో 25 శాతం రైతులు తమ సొంత అవసరాలకు ఉంచుకున్నా, మిగిలిన వడ్లు మార్కెట్​లో అమ్ముకుంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 1.50 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు అమ్ముతారనే అంచనా ఉంది. జిల్లాలో వచ్చిన దిగుబడిలో మూడవ వంతు వడ్లు కొనుగోలు చేయడానికి మార్కెటింగ్, సివిల్​ సప్లై  ఆఫీసర్లు ప్రతి సారి ఇబ్బందులు పడుతున్నారు.

వడ్లు ఎవరికి ఇయ్యాలో?

జిల్లాలో 142 రైస్​ మిల్లులు ఉంటే 101 మిల్లులు డీఫాల్టర్​ లిస్టులోకి ఎక్కాయి. 2024లో 50 శాతం సీఎంఆర్​ పెట్టిన 40 మిల్లులకు ఈసారి అవకాశం ఇచ్చినప్పటికీ, బ్యాంక్  షూరిటీ ఇవ్వాలనే కండీషన్​తో మిల్లర్లు భయపడుతున్నారు. ఈక్రమంలో కొనుగోలు చేసిన వడ్లను మిల్లులకు తరలించకుండా, ఎక్కడ నిల్వ చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మిల్లింగ్​ చేసి సీఎంఆర్​  బకాయి ఉన్న మిల్లర్లపై ప్రభుత్వం 6 జి కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్​ కేసులు పెట్టాలని ఆదేశించింది. దీంతో కోట్లాది రూపాయలు బకాయి ఉన్న మిల్లర్లపై ఆర్ఆర్​ యాక్ట్​ కింద కేసులు పెడుతున్నారు.

కోట్లలో బకాయిలు..

నాగర్ కర్నూల్​ జిల్లాలోని మిల్లర్లు రూ.232 కోట్లు బకాయి పడితే, అధికారులు ఇప్పటి వరకు రూ.138 కోట్ల వరకు కట్టించారు. రూ. 94 కోట్ల బకాయిలు కట్టాల్సి ఉంది. సివిల్​ సప్లై అధికారులు కేసులు పెట్టగానే, బెయిల్​ తెచ్చుకున్న మిల్లర్లు ఆ తరువాత వేరే దందాలు చేసుకుంటున్నారు. గత డిసెంబర్​లో  8 మిల్లులపై ఆర్ఆర్​ యాక్ట్​ కింద కేసులు నమోదు చేసిన అధికారులు, మరో 10 మిల్లులపై ఆర్ఆర్  యాక్ట్​ కింద కేసులు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ, 50 శాతం సీఎంఆర్​ ఇచ్చారనే కారణంతో కేసుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇదిలాఉంటే మూడేండ్ల కింద తీసుకున్న వడ్లకు సంబంధించిన సీఎంఆర్​ ఇప్పటి వరకు ఇవ్వకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.