కరోనా వైరస్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు:సునీతా రెడ్డి

కరోనా వైరస్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు:సునీతా రెడ్డి

‘వీ6’ ఇన్నర్​వ్యూ కార్యక్రమంలో డాక్టర్ సునీతా రెడ్డి   
జనాన్ని ఇన్నాళ్లూ బంధించి ఒక్కసారిగా వదిలేయడం వల్లే చైనాలో కేసులు  
వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వస్తది.. కానీ తీవ్రత తక్కువుంటది
కరోనా మన ప్రయారిటీలను మార్చేసింది
సర్కార్ దవాఖాన్లపై ఖర్చు పెంచాలని కామెంట్​   

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ నుంచి ఎవరూ తప్పించుకోలేరని, హైబ్రిడ్​ఇమ్యూనిటీతోనే దానిపై పోరాడాలని ప్రముఖ ఇన్​ఫెక్షియస్ డిసీజ్ ఎక్స్​పర్ట్​ డాక్టర్ సునీతా రెడ్డి అన్నారు. ‘వీ6’ ఇన్నర్​వ్యూ కార్యక్రమంలో ఆమె కరోనాకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మనం కరోనా ఇన్ఫెక్షన్ కు గురికావడం వల్ల, వ్యాక్సిన్ లు వేసుకోవడం వల్ల.. ఈ రెండింటి ద్వారా వచ్చే ఇమ్యూనిటీనే హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటారని, ఇప్పుడు ఇదే మనల్ని రక్షిస్తోందని ఆమె తెలిపారు. 

కరోనా నాజల్ వ్యాక్సిన్ చాలా సమర్థంగా పనిచేస్తుందని, దాని వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సునీతా రెడ్డి వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే.. 
ప్రశ్న: కరోనా వచ్చి మూడేండ్లైంది. ఇప్పుడు మళ్లా కరోనా అలర్ట్స్ వస్తున్నాయి. జనవరి రెండో వారం నుంచి కేసులు పెరగొచ్చని అంటున్నారు. దీనిని ఎలా చూడొచ్చు? 
సునీతా రెడ్డి: కరోనా వచ్చిన కొత్తల్లో చైనా కఠినమైన లాక్​డౌన్​ను అమలు చేసింది. ఎవరూ బయటకు రాకుండా ఆంక్షలు విధించింది. అడపాదడపా ఒకట్రెండు కేసులొచ్చినా కంట్రోల్ చేయగలిగింది. దాని వల్ల సహజసిద్ధమైన ఇమ్యూనిటీగానీ, వ్యాక్సిన్ ఇమ్యూనిటీగానీ అక్కడి ప్రజలకు రాలేదు. అయితే, కఠినమైన లాక్​డౌన్​ను ఎత్తేయాలంటూ ఈ మధ్య జనాలు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం సడెన్​గా లాక్​డౌన్​ను ఎత్తేసింది. దీంతో కేసులు ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయాయి. మనం సెకండ్​వేవ్​లో ఎదుర్కొన్న పరిస్థితే ఇప్పుడు చైనాలో వచ్చింది. వైరస్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. దానిని ఎదుర్కోవాల్సిందే.. సహజసిద్ధమైన ఇమ్యూనిటీతో, వ్యాక్సిన్లతోనే దానిపై పోరాడాలి. 
ప్రశ్న: జనవరిలో పండగ సెలవులు, ఇతర కారణాలతో కేసులు భారీగా పెరగొచ్చని అంటున్నారు. ఏ స్థాయిలో పెరగొచ్చు?
సునీతా రెడ్డి: అంచనాలు ఎప్పుడూ కరెక్ట్​ కాదు. కరోనా విషయంలో మన అంచనాలన్నీ తప్పాయి. అనుకున్నదానికన్నా కొంచెం ఎక్కువ 
ప్రిపేర్డ్​గా ఉండాలి. కేసులు ఎక్కువొస్తయని అంచనా వేసి ప్రిపేర్ అయితే.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు.  
ప్రశ్న: భవిష్యత్తులో మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకురావొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితి చైనాకే పరిమితమా? లేదా ప్రపంచం మొత్తం అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా?
సునీతా రెడ్డి: మన దేశంలో కరోనా వేరియంట్లకు సంబంధించి ఇన్సాకాగ్ ద్వారా జీనోమ్ సీక్వెన్స్​లు చేస్తున్నాం. మనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది. చైనా జనానికి ఇమ్యూనిటీ లేదు కాబట్టే వాళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది.  
ప్రశ్న: ఈ ఏడాది కాలంలో కరోనా కేసులు, తీవ్రత, లక్షణాల విషయంలో మీరు గమనించిన విషయాలేంటి? 
సునీతా రెడ్డి: కేసుల సంఖ్య చాలా తక్కువ. మన దగ్గర కూడా కరెక్ట్​ డేటా లేదు. రెండు నెలల నుంచి టెస్టులే చేయట్లేదు. ఇప్పుడు కొత్త వేరియంట్లు వచ్చాయి కాబట్టి వైరల్ ఇన్​ఫెక్షన్లకు సంబంధించిన టెస్టులు చేస్తున్నారు. సీరియస్ కేసులూ వస్తున్నా అవి చాలా తక్కువే. మరణాలూ తక్కువే ఉన్నాయి. చైనా వేరియంట్లు మన దగ్గర స్ప్రెడ్ అయితే పరిస్థితి ఏంటన్నది చూడాలి. మనకు నేచురల్ ఇమ్యూనిటీతో పాటు వ్యాక్సిన్ ఇమ్యూనిటీ ఉంది. ఇప్పుడొచ్చే వేరియంట్లను ఎదుర్కోవడానికి ఈ హైబ్రిడ్​ఇమ్యూనిటీ చాలా అవసరం. మన వ్యాక్సిన్ల పనితనమూ ఎక్కువే. ఈ కొత్త వేరియంట్ల లక్షణాలూ దాదాపుగా సేమ్ ఉండొచ్చు.   
ప్రశ్న: ప్రస్తుతం వాసన, రుచి పోతే తప్ప టెస్టులు చేయించుకోవట్లేదు. మామూలు లక్షణాలుంటే వదిలేస్తున్నారు. మనం టెస్ట్ ఎప్పుడు చేయించుకుంటే మంచిది?
సునీతా రెడ్డి: ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మామూలు సింప్టమ్స్ ఉన్నా టెస్ట్ చేయించుకుంటే మంచిది. ప్రస్తుతం హైదరాబాద్​లో స్వైన్ ఫ్లూ వంటి ఇన్​ఫ్లుయెంజా ఇన్​ఫెక్షన్లు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి లక్షణాలుంటే మాస్కును తప్పనిసరిగా పెట్టుకోవాలి. తీవ్రత ఎక్కువుంటే ఇంట్లోనే ఉండడం మంచిది. 
ప్రశ్న: మొన్నటిదాకా బూస్టర్​ డోసు 25 శాతం మంది కూడా తీసుకోలేదు. ఇప్పుడు కేసులు వస్తుండే సరికి జనం బూస్టర్​ డోసుకు క్యూ కడుతున్నారు. అసలు ఈ బూస్టర్ డోస్ అవసరమా?  
సునీతా రెడ్డి: ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లన్నీ కొత్త వేరియంట్లపై పనిచేస్తాయా? లేదా? అన్నది మున్ముందు తెలుస్తుంది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఎఫికసీ ఎక్కువే అయినా దాని ప్రభావం పోయాక ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీంతో బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వస్తుంది. అమెరికా, యూరప్​దేశాల్లో ఇదే జరగడంతో చాలా మందికి నేచురల్ ఇమ్యూనిటీ రాలేదు. కానీ, మన దేశంలో వ్యాక్సిన్లతో పార్షియల్ ఇమ్యూనిటీ వచ్చింది. జనానికి వైరస్ మళ్లీ సోకినా తీవ్రత తక్కువగానే ఉంది. దీంతో మనోళ్లకు ఇటు వ్యాక్సిన్లు, అటు నేచురల్ ఇమ్యూనిటీ వచ్చింది. అలాగే ఇంట్రా నాజల్ వ్యాక్సిన్ ప్రభావం చాలా ఎక్కువ. నేరుగా ముక్కులోనే వేసుకోవడం ద్వారా వైరస్ లోకల్ రెప్లికేషన్ తగ్గిపోతుంది. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం తగ్గుతుంది. మాస్ వ్యాక్సినేషన్ కూడా ఈజీ అవుతుంది. వాస్తవానికి వ్యాక్సిన్లు ఎక్కువగా తీసుకోవడం కూడా నష్టమే. భవిష్యత్తులో వేసుకునే వ్యాక్సిన్లు పనిచేయకపోవచ్చు. అయితే, అవసరాన్ని బట్టి వ్యాక్సిన్లు తీసుకోవడమూ తప్పదు.   
ప్రశ్న: కరోనా నుంచి ఏం నేర్చుకున్నాం? ఇంకా ఏం నేర్చుకోవాలి?
సునీతా రెడ్డి: కరోనా వల్ల ప్రయారిటీస్​ మారాయి. ఫ్యామిలీతో ఎక్కువగా గడుపుతున్నాం. ఆస్పత్రుల్లో సౌలతులు పెరిగాయి. ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఐసీయూ, వెంటిలేటర్లను సమకూర్చుకున్నాం. దాని వల్ల కరోనానే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలకూ ట్రీట్​మెంట్లు మెరుగయ్యాయి. టెలీ మెడిసిన్ కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను కరోనా కోసం తయారు చేశారు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్​తో కేన్సర్​వ్యాక్సిన్లను తయారుచేసేందుకు రీసెర్చ్ జరుగుతున్నది.  
ప్రశ్న: కరోనాతో హెల్త్​ఇన్​ఫ్రాస్ట్రక్చర్ బాగుపడిందన్నారు. పేదలకు అన్ని సౌలతులు అందే స్థాయిలో సర్కార్ దవాఖాన్లు మారాయా? 
సునీతా రెడ్డి: ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ దవాఖానలు చాలా వరకు మెరుగుపడ్డాయి. దానిని అలాగే కంటిన్యూ చేయాలి. హెల్త్​కేర్ సెక్టార్​లో మ్యాన్​పవర్​ ట్రైనింగ్ ఎక్కువగా జరగాలి. పీహెచ్​సీల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఏ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలను ఆ స్థాయిలో తీసుకోవాలి. డీసెంట్రలైజేషన్ జరగాలి. ప్రభుత్వాలు సర్కారు దవాఖాన్లపై మరింత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. పేదలకూ నాణ్యమైన వైద్యం అందేలా వాటిని మరింత తీర్చిదిద్దాల్సి ఉంది. 

ప్రశ్న: మనోళ్లకు ఇమ్యూనిటీ ఎక్కువేనన్న వాదన నిజమేనా? 
సునీతా రెడ్డి: అమెరికా, యూరప్ దేశాలు శీతల ప్రాంతాలు. కానీ, మనది ఉష్ణమండల(ట్రాపికల్) ప్రాంతం. అమెరికా, యూరప్ లతో పోలిస్తే మనలాంటి ట్రాపికల్ దేశాల్లో వైరల్ ఇన్​ఫెక్షన్లు కాస్త ఎక్కువే. దాని వల్ల మనకు ముందు నుంచీ సహజంగానే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. యాంటీ బాడీలు వృద్ధి చెంది ఉంటాయి. అదే మనల్ని కాపాడుతూ ఉంటుంది. హెర్డ్ ఇమ్యూనిటీ కూడా మనల్ని కరోనా నుంచి కాపాడిందనే చెప్పాలి. వచ్చే వేవ్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ, వాటికి ప్రిపేర్ అయిఉండాలి. జాగ్రత్తలు పాటించాలి. దవాఖాన్లలో పరికరాలను టెస్ట్​ చేసుకోవాలి. మందులు, సిబ్బందిని సిద్ధంగా పెట్టుకోవాలి.  

ప్రశ్న: హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉన్నా కరోనా వస్తుందా? ఎవరికి ఎక్కువ ప్రమాదం?
సునీతా రెడ్డి: కచ్చితంగా వస్తుంది. చాలా మంది దేశ విదేశాలకు వెళ్లి వస్తున్నారు. దాని వల్ల ఇన్​ఫెక్షన్లు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తితో పోలిస్తే వేరే జబ్బులున్నోళ్లకు వైరస్ సోకితే కరోనా తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు కరోనా బారిన పడనివాళ్లు, వ్యాక్సిన్ తీసుకోని వాళ్లకు ఇప్పుడు కరోనా సోకితే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే బూస్టర్​డోస్ తీసుకోవాలని చెప్తున్నాం.  

ప్రశ్న: కరోనా గురించి తెలుసు కోవాల్సిన కొత్త విషయాలేంటి? 
సునీతా రెడ్డి: వైరస్​ల సంఖ్య ఎక్కువ. మనం వైరస్​కు పది రెట్లు అడ్వాన్స్​గా ఆలోచిస్తే.. అవి మనకు వంద రెట్లు అడ్వాన్స్​గా మారి పోతాయి. అవి రెప్లికేట్, మ్యుటేట్ అయ్యే కొద్దీ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. మనం ఉండే అంతలో ఉండాలంతే. ప్రకృతిని గౌరవించాలి. ఇప్పుడు జంతువులు, మనుషుల మధ్య దూరం తగ్గిపోయింది. దీంతో ఆ జంతువులలోని వైరస్​లు మనుషుల్లోకి చేరి మరింత స్ట్రాంగ్ అవుతున్నాయి. ఎగ్జోటిక్ పెట్స్ (పెంపుడు జంతువులు కాని అడవి జంతువులు)ని ముద్దు చేస్తే భవిష్యత్తులో మనకే ముప్పు.  

వైరస్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. దాన్ని ఎదుర్కోవాల్సిందే.. సహజసిద్ధమైన ఇమ్యూనిటీ, వ్యాక్సిన్లతోనే దానిపై పోరాడాలి.
- డాక్టర్ సునీతా రెడ్డి