హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తొలి దశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ప్రముఖ జర్నలిస్ట్ చందర్ శ్రీవాస్తవ్ ను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు సన్మానించారు. సోమవారం నాంపల్లి మీడియా అకాడమీలో ఈ కార్యక్రమం జరిగింది. చందర్ శ్రీవాస్తవ్..ఉర్దూ, ఇంగ్లీష్ , తెలుగు, హిందీ నాలుగు భాషల్లోనూ కొన్ని దశాబ్దాల పాటు పత్రికా రచనలు చేశారు. సన్మానం సందర్భంగా తెలంగాణా తొలి దశ ఉద్యమానికి సంబంధించిన అనేక విషయాలను శ్రీవాస్తవ జ్ఞాపకం చేసుకున్నారు. 1969 తొలి ఉద్యమానికి రెండేండ్లకు ముందే ఖమ్మంలో తొలి తెలంగాణా జర్నలిస్ట్ ల సభ నిర్వహించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పిన విషయం శ్రీవాస్తవ గుర్తుచేశారు.
దేశంలో జర్నలిజం ప్రమాణాలు, విలువలు పూర్తిగా దిగజారిపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా మీడియా అకాడమీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించి చందర్ శ్రీవాస్తవ ను ఘనంగా సత్కరించారు. శ్రీవాస్తవతో కలిసి పనిచేసినరోజులను శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ ప్రెస్ అకాడమీ పూర్వాధ్యక్షుడు, మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎం. ఏ మాజిద్, మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్ రావు సహా పలువురు జర్నలిస్ట్ లు సమావేశానికి హాజరయ్యారు.
