అద్దెకు బ్యాంకు అకౌంట్లు.. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఈ తరహా ఖాతాలు

అద్దెకు బ్యాంకు అకౌంట్లు.. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఈ తరహా ఖాతాలు
  • అమాయకులకు డబ్బులు ఎరవేసి తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు
  • సీబీఐ దాడుల్లో కేవలం 5 రాష్ట్రాల్లోనే 8.5 లక్షల మ్యూల్​ అకౌంట్లు గుర్తింపు
  • రాష్ట్రంలోనూ పెద్దసంఖ్యలో ఈ తరహా ఖాతాలు
  • విదేశాల్లో నుంచి ఆన్​లైన్‌‌‌‌‌‌‌‌లో ఆపరేట్​ చేస్తూ క్రిప్టో కరెన్సీ , బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్స్‌‌‌‌‌‌‌‌ రూపంలో మనీ తరలింపు
  • ఇటీవల 25 మందిని అరెస్ట్​ చేసిన సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో
  • అసలు నేరగాళ్లు తప్పించుకోవడంతో చిక్కుతున్న ఖాతాదారులు

హైదరాబాద్‌‌కు చెందిన ఏడుగురు, రాజస్థాన్‌‌కు చెందిన ఇద్దరు సహా తొమ్మిది మందితో ఓ ఇంటర్నేషనల్​ సైబర్  నేరగాడు మ్యూల్‌‌ అకౌంట్లను సేకరించాడు. వీరు అందించిన నకిలీ ఖాతాల ద్వారా ఆన్‌‌లైన్‌‌ మోసాలకు పాల్పడేవాడు. ఈ 9 మంది సప్లయ్ చేస్తున్న మ్యూల్‌‌ బ్యాంక్‌‌  ఖాతాలను రిమోట్‌‌ యాక్సెస్ చేయడానికి కేవలం సామ్‌‌సంగ్ ఫోన్లనే వినియోగించేవాడు. ఇక్కడి ఏజెంట్లు ఏపీకే ఫైల్స్‌‌ ద్వారా మ్యూల్‌‌ బ్యాంక్ అకౌంట్లను విదేశాల్లోని సైబర్ నేరగాడికి అందించేవారు. పక్కా సమాచారం ప్రకారం సైబరాబాద్ పోలీసులు గురువారం దాడులు చేసి..తొమ్మిది మందిని అరెస్ట్‌‌ చేశారు. 

హైదరాబాద్‌‌, వెలుగు: ఇండియన్స్​ బ్యాంక్‌‌ అకౌంట్లను ఇంటర్నేషనల్ సైబర్‌‌‌‌ నేరగాళ్లు టార్గెట్‌‌ చేస్తున్నారు. కొందరు ఏజెంట్ల సాయంతో అమాయకులకు డబ్బులు ఎరవేసి.. వారి అకౌంట్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఆన్‌‌లైన్‌‌ మోసాలతో కొట్టేసిన  వేల కోట్ల రూపాయలను మ్యూల్​అకౌంట్లకు ట్రాన్స్‌‌ఫర్ చేసుకొని.. క్రిప్టో కరెన్సీ, బిట్‌‌ కాయిన్స్ రూపంలో దేశంతోపాటు విదేశాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం ఏజెంట్లతోపాటు ఖాతాదారులకు భారీగా కమీషన్లు చెల్లిస్తున్నారు. దేశవ్యాప్తంగా మ్యూల్‌‌ అకౌంట్ల నెట్‌‌వర్క్‌‌ పనిచేస్తుండగా, వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌‌గా మారింది. ఇలాంటి మ్యూల్ అకౌంట్లను గుర్తించి ఖాతాదారులను, ఏజెంట్లను అరెస్ట్​ చేస్తున్న పోలీసులకు విదేశాల్లో ఉండే సైబర్ నేరగాళ్లు మాత్రం చిక్కడం లేదు. దీంతో ఏజెంట్ల మాయమాటలు నమ్మి అకౌంట్లు అప్పగిస్తున్న ఖాతాదారులు బలవుతున్నారు. ఇటీవల సీబీఐ కేవలం 5 రాష్ట్రాల్లో ఏకంగా 8.5 లక్షల మ్యూల్‌‌ అకౌంట్లను గుర్తించడం సంచలనం సృష్టించింది. తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో మ్యూల్‌‌ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు తెలుస్తుండగా, ఇటీవల 25 మందికిపైగా ఖాతాదారులను సైబర్‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్‌‌ చేశారు.  

3 నెలల పాటు అద్దె, డిపాజిట్లకు కమీషన్లు
ప్రతి ఏటా పెరిగిపోతున్న సైబర్‌‌‌‌ నేరాల్లో నైజీరియన్ గ్యాంగ్స్‌‌, చైనా సైబర్ నేరగాళ్ల పాత్రే ఎక్కువగా ఉంటున్నది. వీరే ఎక్కువగా ఆన్‌‌లైన్​ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, యూపీ, బిహార్, రాజస్థాన్‌‌, జార్ఖండ్‌‌సహా నార్త్‌‌ ఇండియాలోని ఏజెంట్లను నియమించుకొని.. రూ.కోట్ల కమీషన్‌‌ దందా చేస్తున్నారు.  ఏడాది కాలంగా ఏపీ, తెలంగాణసహా సౌత్‌‌ ఇండియాలోని మెట్రో సిటీస్‌‌లో మ్యూల్ అకౌంట్ల నెట్‌‌వర్క్‌‌ ఆర్గనైజ్డ్‌‌ క్రైమ్‌‌గా మారింది. నార్త్‌‌ ఇండియాలోని గ్రామీణ ప్రాంతాలను ఫేక్ అకౌంట్స్‌‌ కోసం సైబర్ నేరగాళ్లు ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నారు.

గవర్నమెంట్‌‌ స్కీమ్స్ డబ్బులు డిపాజిట్‌‌ అవుతాయని నమ్మిస్తున్నారు. యువకులకు కమీషన్స్ ఆశ చూపుతున్నారు. 3 నుంచి 4 నెలలపాటు రూ.5 వేల నుంచి మొదలు ఖాతాదారుల ఆర్థిక స్థోమతను బట్టి రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. డిపాజిట్‌‌ అవుతున్న డబ్బుకు అనుగుణంగా10 నుంచి 25 శాతం ఏజెంట్లకు కమీషన్లు ఇస్తున్నారు. మ్యూల్‌‌ అకౌంట్లలో డిపాజిట్‌‌ అయిన డబ్బును క్రిప్టో, బిట్‌‌కాయిన్స్ రూపంలో విదేశాలకు తరలిస్తున్నారు. ఇలాంటి అకౌంట్లను దర్యాప్తు సంస్థలు గుర్తించేంత వరకు అందినకాడికి దోచుకుంటున్నారు.

5 రాష్ట్రాల్లో 700 బ్రాంచీల నుంచి మ్యూల్ అకౌంట్స్..
డిజిటల్ అరెస్ట్‌‌లు, ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌, జాబ్‌‌ ఫ్రాడ్‌‌, వర్క్‌‌ ఫ్రమ్ హోమ్‌‌ సహా ఆన్‌‌లైన్‌‌, సోషల్‌‌మీడియా కేంద్రంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో మ్యూల్‌‌ అకౌంట్ల లింకులే బయటపడుతున్నాయి.1930, నేషనల్‌‌ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌‌ (ఎన్‌‌సీఆర్‌‌‌‌పీ)కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సైబర్ నేరాలతో లింకైన బ్యాంక్ అకౌంట్లను కేంద్ర దర్యాప్తు సంస్థలతోపాటు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీ సీఎస్‌‌బీ), సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తిస్తున్నారు. ఇలాంటి మ్యూల్ అకౌంట్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌‌ (సీబీఐ) జూన్‌‌ 16న దేశవ్యాప్తంగా సోదాలు జరిపింది.

డిజిటల్ అరెస్ట్‌‌లు, ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఫ్రాడ్స్‌‌ సహా సైబర్ నేరాలతో లింకులు ఉన్న బ్యాంక్ అకౌంట్ల కోసం సెర్చ్  ఆపరేషన్ చేసింది. ‘ఆపరేషన్ చక్ర’లో భాగంగా రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌‌లోని 42 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సైబర్ మోసాల్లో వినియోగించిన 8.5 లక్షల నకిలీ బ్యాంక్‌‌ అకౌంట్లను వివిధ జాతీయ బ్యాంకులకు చెందిన 700కు పైగా బ్రాంచీల నుంచి ఓపెన్ చేసినట్లు గుర్తించింది. సైబర్ మోసగాళ్లకు కొంతమంది బ్యాంకు అధికారులు, ఏజెంట్లు, అగ్రిగేటర్లు, బ్యాంక్ కరస్పాండెంట్లు, మధ్యవర్తులు, ఈ మిత్రల నుంచి సహాయం అందుతున్నదని ఆధారాలు సేకరించింది.