కామారెడ్డి : కార్లను అద్దెకు తీసుకుని అమ్ముతున్న ముఠా .. నలుగురు అరెస్ట్

కామారెడ్డి : కార్లను అద్దెకు తీసుకుని అమ్ముతున్న ముఠా .. నలుగురు అరెస్ట్
  • కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర వెల్లడి 

కామారెడ్డి, వెలుగు : సెల్ఫ్​డ్రైవింగ్​కోసం కార్లను అద్దెకు తీసుకుని అమ్ముతున్న ముఠాలోని నలుగురిని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు  చేశారు.  కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం  మీడియాకు వివరాలు వెల్లడించారు. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఉప్పల్​వాయి ప్రశాంత్​గౌడ్​కొద్దిరోజుల కింద ఆన్​లైన్​లో చూసి కారును కొనుగోలు చేసి మోసపోయాడు. ఈనెల18న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. 

ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్​ టీమ్​నిఘా పెట్టి ముఠాలోని సభ్యులను అరెస్టు చేసింది. రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్​జిల్లాలకు చెందిన మహమ్మద్​ఇయాజ్, మహమ్మద్ జాహీద్, పృథ్వీ జగదీశ్, రాచర్ల శివకృష్ణ,  కర్ణకోట సాకేత్, వేములయాడ వివేక్, అలీ ముఠాగా గుర్తించింది. 

వీరు సెల్ఫ్​డ్రైవింగ్​కోసం పలువురి వద్ద కార్లను అద్దెకు తీసుకుని.. నంబర్​ప్లేట్​మార్చి, ఫేక్​ఆర్​సీ, ఆధార్​వంటి డాక్యుమెంట్లు సృష్టించి ఆన్​లైన్​ ద్వారా అమ్ముతున్నారు.  ఆ తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తులను బెదిరించడం, ఎక్కడైనా పార్కింగ్ చేసి ఉంటే మరో లాక్ తో  తీసుకెళ్లడం చేస్తున్నారు. 

ముఠాలోని మహమ్మద్ ఇయాజ్, మహమ్మద్ జాహీద్, కర్ణకోట సాకేత్​, వేములయాడ వివేక్​ను అరెస్టు చేసి.. 3 కార్లు, 15 సెల్​ఫోన్లు, జీపీఎస్​పరికరాలు, 1  ల్యాప్​టాప్​, 10 మైక్రోసిమ్​కార్డులు, చిప్​కార్డులు, ఫోర్జరీ చేసిన ఆర్​సీలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వీరిపై పలు ప్రాంతాల్లోని పీఎస్ ల్లో కేసులు నమోదై ఉన్నాయి. కామారెడ్డి రూరల్ సీఐ రామన్,  మాచారెడ్డి ఎస్ఐ అనిల్,  సిబ్బంది సుభాష్, సిద్దిరాములు, శ్రీకాంత్,  శ్రీనివాస్​ను ఎస్పీ అభినందించారు.