ప్రస్తుతం సోషల్ మీడియా ఎంత ఉపయోగకరంగా ఉందో, అంతకంటే ఎక్కువగా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కామెంట్లు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం కొందరికి పరిపాటిగా మారింది. అయితే, ఇలాంటి ఆన్‌లైన్ వేధింపులపై నటి రేణు దేశాయ్ సీరియస్ గా తీసుకుంది. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో పలువురిని కటకటాల వెనక్కి పంపినట్లు ఆమె సంచలన ప్రకటన చేశారు.
ఆరుగురి అరెస్ట్!
గత కొంతకాలంగా తనపై వస్తున్న ట్రోలింగ్‌ను మౌనంగా భరించిన రేణు దేశాయ్, చివరకు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. తనపై అభ్యంతరకరమైన కామెంట్లు పోస్ట్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిలో ఆరుగురుని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారని ఆమె వెల్లడించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ఇది ఇక్కడితో ఆగదు అంటూ ఆమె పరోక్షంగా మిగిలిన ట్రోలర్లకు గట్టి సంకేతాలను పంపారు. సైబర్ క్రైమ్ పోలీసులు చాలా వేగంగా స్పందించారని, వ్యవస్థపై తనకున్న నమ్మకం మరింత పెరిగిందని ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ట్రోలర్లకు హెచ్చరిక!
కేవలం ఫేమ్, ఫాలోవర్స్ పెంచుకోవాలనే పిచ్చితో సెలబ్రిటీలపై ఇష్టానుసారంగా వాగే వారికి రేణు దేశాయ్ ఒక హెచ్చరిక జారీ చేశారు. మీ అకౌంట్లను ట్రేస్ చేసి మరీ అరెస్ట్ చేయిస్తా. ఒకసారి ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదైతే మీ భవిష్యత్తు, కెరీర్ నాశనమవుతాయి అని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు, నిందితుల వివరాలను వారి పని చేసే కార్యాలయాలకు, వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసే అవకాశం ఉందని, తద్వారా వారు సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
బాధ్యతాయుతంగా ఉండండి
ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, దాన్ని ద్వేషాన్ని చిమ్మడానికి ,అసభ్యతను ప్రచారం చేయడానికి ఉపయోగించవద్దని రేణు హితవు పలికారు. మీకు ఎవరిపైనైనా విమర్శలు ఉంటే, వాటిని గౌరవప్రదమైన రీతిలో వ్యక్తపరచండి. కానీ, భాష అదుపు తప్పితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని నెటిజన్లకు సూచించారు.
Also Read : 42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బిగ్బాస్ బ్యూటీ
అయితే పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన సమాధానాలు విని అందరూ షాక్ అవుతున్నారు. కేవలం 'అటెన్షన్' కోసమే తాము ఇలాంటి కామెంట్లు చేశామని వారు అంగీకరించడం గమనార్హం. ప్రస్తుతం రేణు దేశాయ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సెలబ్రిటీలపై నోరు పారేసుకునే వారికి ఇదొక గుణపాఠం కావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
