కాళేశ్వరం బ్యాక్​ వాటర్ ముంపుపై రిపోర్ట్ ఇవ్వండి

కాళేశ్వరం బ్యాక్​ వాటర్  ముంపుపై రిపోర్ట్ ఇవ్వండి
  • రెండు నెలల్లో రిపోర్టు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ హెచ్ఆర్సీ ఆదేశం

న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్ట్​ బ్యాక్​ వాటర్ ముంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్ హెచ్ఆర్ సీ) నోటీసులు జారీ చేసింది. ముంపు ప్రభావంపై స్టడీ చేసి 8 వారాల్లోగా రిపోర్ట్ ఇయ్యాలని ఆదేశించింది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు నష్టపోతున్న రైతులకు పరిహారం చెల్లింపుతో పాటు పునరావాసం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు అడ్వకేట్ కె.శ్రావణ్​కుమార్​నవంబర్ 30న ఎన్​హెచ్​ఆర్​సీలో పిటిషన్​ వేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్​ వాటర్​తో మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో ఏటా 60 వేల నుంచి 80 వేల ఎకరాల్లో పంటలు నీటమునుగుతున్నాయని పిటిషన్​లో పేర్కొన్నారు. మూడేండ్లుగా సుమారు30 వేల మంది రైతులు, కౌలు రైతులు పంటలు నష్టపోతున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్​కు చెందిన కమ్ముల రాజేశ్​(28) అనే యువరైతు పంటనష్టంతో మనస్తాపం చెంది సెప్టెంబర్ 23న స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని ఎన్ హెచ్ఆర్​సీ దృష్టికి తీసుకెళ్లారు. 

‘వీ6 వెలుగు’ దిన పత్రికతో పాటూ ఇతర పత్రికల్లో వచ్చిన ముంపు సమస్య కథనాలను శ్రావణ్ ఎన్ హెచ్ఆర్ సీకి ఇచ్చిన ఫిర్యాదు కాపీకి జత చేశారు.  కేసు విచారించిన కమిషన్​కాళేశ్వరం బ్యాక్​వాటర్​ముంపు, రైతులకు జరుగుతున్న నష్టంపై అధ్యయనం చేసి 8 వారాల్లోగా రిపోర్టు ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలను, తెలంగాణ ప్రభుత్వ చీఫ్​ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్​జీటీ ఆర్డర్స్​ను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. కాగా, ఇదే అంశంపై గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శి, పెద్దపల్లి మాజీ ఎంపీవివేక్​ వెంకటస్వామి గవర్నర్ ​తమిళి సైకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

న్యాయం జరిగేనా...?
కాళేశ్వరం ప్రాజెక్టు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల రైతాంగానికి శాపంగా మారింది. మూడేండ్లుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్​ వాటర్​తో గోదావరి ఒడ్డుపొంట వేలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు మునిగిపోతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్​ నియోజకవర్గంలోనే దాదాపు 30 వేల ఎకరాల్లో పంటలు నీటిపాలవుతున్నాయి. ముంపుతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని, ముంపు భూములను ప్రభుత్వమే తీసుకొని ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించాలని బీజేపీ డిమాండ్​ చేస్తోంది. రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వివేక్​ ఆధ్వర్యంలో రెండేండ్లుగా పోరాడుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. సీఎం కేసీఆర్​కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, ఇందులో రూ.50 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ముంపు సమస్యపై ఎన్ హెచ్​ఆర్​సీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు నోటీసులివ్వడంతో ఇకనైనా రైతులకు న్యాయం జరుగుతుందా అనే చర్చ మొదలైంది.

రైతుల ఆత్మహత్యలు..
కాళేశ్వరం బ్యాక్​వాటర్​లో పంటలు మునగడంతో రెండేడ్లలో మంచిర్యాల జిల్లాలో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుడు కోటపల్లి మండలం పుల్లగామకు చెందిన కామ లింగయ్య(60) పదెకరాలు కౌలు పట్టి పత్తి వేశాడు. ఆగస్టు నెలాఖరులో గోదావరికి వరద పోటెత్తింది. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్​వాటర్​వల్ల ప్రాణహిత ఒడ్డు పొంట10 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అప్పులపాలైన లింగయ్య నిరుడు సెప్టెంబర్​ 21న పురుగులమందు తాగి ప్రాణం తీసుకున్నాడు. బాధిత కుటుంబానికి ఎక్స్​గ్రేషియా ఇస్తామని చెన్నూర్​ఎమ్మెల్యే బాల్క సుమన్​ ప్రకటించినా ఇప్పటికీ ఆ ఊసేలేదు. ఈ ఏడాది చెన్నూర్​ జెండావాడకు చెందిన కమ్ముల రాజేష్​(28) బతుకమ్మ వాగు దగ్గర్లో ఆరెకరాలు కౌలుకు తీసుకుని పత్తి పెట్టాడు. జులై నెలాఖరులో అన్నారం బ్యారేజీ వాటర్​లో పంట మునిగింది. దాన్ని చెడగొట్టి మళ్లా పత్తి, మిర్చి వేయగా, సెప్టెంబర్​ మొదటివారంలో మరోసారి బ్యాక్​ వాటర్​ ముంచెత్తింది. పెట్టుబడులకు చేసిన రూ.5 లక్షల అప్పు మీదపడటంతో మనస్తాపం చెంది సెప్టెంబర్​23న చెన్నూర్​ పెద్ద చెరువులో దూకి చనిపోయాడు. ఎమ్మెల్యే బాల్క సుమన్​ కంటితుడుపు చర్యగా రూ.2 లక్షలు అందించి చేతులు దులుపుకున్నాడు తప్ప ప్రభుత్వం నుంచి ఎక్స్​గ్రేషియా ఇప్పించలేకపోయాడు.