లింగంపేట, వెలుగు : గాంధారి మండలం వండ్రికల్ గ్రామ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టి తరగతులు నిర్వహించడం, పాఠశాల ఆవరణలో చెత్తా చెదారం ఉండడంతో హెచ్ఎం, పంచాయతీ సెక్రటరీపై సీరియస్ అయ్యారు. మెమోలు జారీ చేయాలని డీఈవో రాజు, డీపీవో మురళిని ఆదేశించారు. మధ్యాహ్న భోజన వంట గదిని పరిశీలించారు. ప్రైమరీ స్కూళ్లకు అందించిన ఫ్రీ స్కూల్కిట్ ను చిన్నారులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. స్టోర్‌రూంలో నిల్వ ఉంచిన కోడి గుడ్లను పరిశీలించి చిన్నారులకు పోషకాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రం కిటికీలు, తలుపులను మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇసుక, మొరం, ఇటుకలతోపాటు ఇంటి నిర్మాణ సామగ్రి కొరత లేకుండా చూడాలన్నారు.
ఎరువులు అధిక ధరలకు విక్రయించొద్దు..
ఎరువులను అధిక ధరలకు విక్రయించవద్దని, బిల్లులు ఇవ్వకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. గాంధారి మండల కేంద్రంలోని మౌనిక ఫర్టిలైజర్ షాపు ను తనిఖీ చేశారు. రికార్డులు, స్టాక్‌ను పరిశీలించి మాట్లాడారు. ప్రతి రైతుకు ఎరువులు అందేలా చూడాలన్నారు.
షాపుల ఎదుట ధరల పట్టిక పెట్టాలని, టోల్‌ఫ్రీ నంబర్లు స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. కలెక్టర్ వెంట ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీఆర్డీవో సురేందర్, స్త్రీ శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారిణి ప్రమీల, డీఈవో రాజు, డీపీవో మురళి, హౌసింగ్ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి, తహసీల్దార్ రేణుక, ఎంపీడీవో రాజేశ్వర్, ఏవో రాజలింగం తదితరులు ఉన్నారు.
