చైనాలో క్రికెట్: కెప్టెన్‌గా ధావన్.. యువ ఆటగాళ్లకు చోటు

చైనాలో క్రికెట్: కెప్టెన్‌గా ధావన్.. యువ ఆటగాళ్లకు చోటు

చైనాలో క్రికెట్టా! అనుకోకండి.. మీరు విన్నది నిజమే. డ్రాగన్ కంట్రీలోని హాంగ్‌జౌలో నగరంలో 'ఆసియన్ గేమ్స్‌ 2023' జరగనున్నాయి. అందులో భాగంగానే భారత జట్టు అక్కడ పర్యటించనుంది. ఈ కాంటినెంటల్ గేమ్స్ కోసం బీసీసీఐ.. ఇండియా-'బి' జట్టును పంపాలని యోచిస్తోందట. ఈ జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడని సమాచారం.

హాంగ్‌జౌ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. అదే సమయంలో ఆసియా కప్ 2023, వరల్డ్ కప్ 2023 వంటి మెగా టోర్నీలు ఉండడంతో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో కనిపించరు. వారి స్థానంలో సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 30లోపు భారత క్రీడాకారుల జాబితాను భారత ఒలింపిక్ సంఘానికి బీసీసీఐ పంపనుంది. 

స్వర్ణమే లక్ష్యం.. 

2010, 2014 రెండు ఎడిషన్లలో క్రికెట్ ఉన్నా.. భారత జట్లు ఆ టోర్నీల్లో పాల్గొనలేదు. ఆ తరువాత జకార్తా వేదికగా జరిగిన 2018 ఎడిషన్‌లో క్రికెట్ ను కండక్ట్ చేయలేదు. అనంతరం 2022 ఎడిషన్‌లో తిరిగి చేర్చారు. గతేడాదే ఈ టోర్నీ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. 

ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోని ఐదు సభ్యు దేశాలతో పాటు నేపాల్, ఇరాన్, ఇండోనేషియా, కతర్, సింగపూర్ వంటి దేశాల జట్లు ఈ టోర్నీలో పాల్గొనవచ్చు. ఈ క్రీడల్లో భారత క్రికెట్ జట్టు స్వర్ణం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఈ కాంటినెంటల్ కప్ కోసం భారత మహిళల జట్టును పంపాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.