రామంతాపూర్ చెరువుపై హైకోర్టుకు నివేదిక

రామంతాపూర్ చెరువుపై హైకోర్టుకు నివేదిక
  • 24 గంటల్లో ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ నిర్ధారిస్తూ నోటిఫికేషన్
  • ఈసీ అనుమతితో రెండు నెలల్లో పూడికతీత
  • చెరువు చుట్టూ కంచె వేస్తమని వెల్లడి
  • హైకోర్టు ఆదేశాలతో ఆఫీసర్లలో కదలిక

హైదరాబాద్, వెలుగు : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 ఏండ్లుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న వ్యవహారంపై హైకోర్టు కొరడా ఝుళిపించడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. హైదరాబాద్‌‌‌‌ సిటీలోని రామంతాపూర్‌‌‌‌ పెద్దచెరువు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ను నిర్ధారిస్తూ 24 గంటల్లోనే ప్రాథమిక నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసింది. నెలలోగా తుది నోటిఫికేష న్‌‌‌‌ను కూడా వెలువరిస్తామని గురువారం హైకోర్టుకు వివరించింది.

ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ నిమిత్తం 2016లో జీహెచ్‌‌‌‌ఎంసీ ప్రతిపాదనలు పంపామని, ప్రాథమిక నోటిఫికేషన్‌‌‌‌ వెలువడలేదని జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌ రోనాల్డ్‌‌‌‌ రాస్‌‌‌‌ ఈ నెల 10న జరిగిన హైకోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరించారు. నోటిఫికేషన్‌‌‌‌ వెలువరించకపోతే జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్​తో పాటు మున్సిపల్‌‌‌‌ శాఖ కమిషనర్‌‌‌‌ కూడా విచారణకు హాజరుకావాలని హెచ్చరించింది. గురువారం జరిగిన విచారణకు తిరిగి కమిషనర్‌‌‌‌ రోనాల్డ్‌‌‌‌ రాస్‌‌‌‌ హాజరై ప్రాథమిక నోటిఫికేషన్‌‌‌‌ వెలువడిందని చెప్పారు.

రామంతాపూర్‌‌‌‌లోని 25 ఎకరాల పెద్దచెరువును డంపింగ్‌‌‌‌ యార్డుగా మారుస్తున్నారని, నీరు కాలుష్యమయ్యేలా చేస్తున్నారంటూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ కె.ఎల్‌‌‌‌.వ్యాస్‌‌‌‌ 2005లో రాసిన లేఖను హైకోర్టు పిల్‌‌‌‌గా పరిగణించి విచారణ చేస్తున్నది. గురువారం మరోసారి చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఆలోక్‌‌‌‌ అరాధే. జస్టిస్‌‌‌‌ ఎన్‌‌‌‌.వి.శ్రవణ్‌‌‌‌ కుమార్‌‌‌‌లతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ మరోసారి విచారణ జరిపింది.హైకోర్టు ఆదేశాల తర్వాత ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ను నిర్ణయిస్తూ ఈ నెల 11న మున్సిపల్‌‌‌‌ శాఖ వెలువరించిన నోటిఫికేషన్‌‌‌‌ను కమిషనర్‌‌‌‌ స్వయంగా అందజేశారు.

చెరువు గట్టుపై మొక్కల పెంపు చర్యలు చేపట్టామని, 2 నెలల్లోగా పూర్తి చేస్తామన్నారు. ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెరువుకు ఇప్పటికే 400 మీటర్ల ఫెన్సింగ్‌‌‌‌ వేశామని, మరో 1,471 మీటర్ల ఫెన్సింగ్ వేయాలని, ఇందుకు వారంలోగా ప్రపోజల్స్ రెడీ చేస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్‌‌‌‌ కోడ్‌‌‌‌ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్‌‌‌‌ అనుమతి పొందాల్సివుందని వివరించారు.

ఈసీ అనుమతి ఇచ్చిన రెండు నెలల్లోగా ఫెన్సింగ్‌‌‌‌ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చెరువులో పూడికతీతకు కూడా ఈసీ అనుమతి పొందుతామని వివరించారు. ఈసీ అనుమతి రాగానే టెండర్లను ఆహ్వానించి పనుల్ని రెండు నెలల్లో చేస్తామన్నారు. హామీ మేరకు పనులు చేపట్టి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను డిసెంబరు 28కి వాయిదా వేసింది. అప్పుడు కమిషనర్‌‌‌‌ వ్యక్తిగతంగా విచారణకు రావాల్సిన అవసరం లేదని చెప్పింది.