Paytm-RBI: పేటీఎం వివాదంలోకి ఈడీ ఎంట్రీ.. లావాదేవీలపై విచారణ

Paytm-RBI: పేటీఎం వివాదంలోకి ఈడీ ఎంట్రీ.. లావాదేవీలపై విచారణ

ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎంపై భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్‌బీఐ) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా నిషేధించడంతో పాటు మార్చి ప్రారంభం నుండి కస్టమర్‌లు వారి సేవింగ్ అకౌంట్ల నుంచి డబ్బు పంపడం లేదా వాలెట్లలో తాజా డిపాజిట్లను స్వీకరించడాన్ని నిలిపివేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

ఈ వివాదంలోకి తాజగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విషయంలో ఏదేని నిధుల అవకతవకలు, మనీలాండరింగ్ వంటివి జరిగాయా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేయనున్నట్లు రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ నిధులు స్వాహా చేసినట్లు తేలితే దానిపై మరింత లోతుగా విచారణ ఈడీ జరుపుతుందని ఆయన పేర్కొన్నారు.

లైసెన్స్ రద్దు..!

కాగా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలకు సంబంధించి లైసెన్స్‌ను రద్దు చేసే యోచనలో ఆర్‌బీఐ ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి 29తో గడువు ముగుస్తుంది కనుక మార్చి నెల ప్రారంభంలో లైసెన్స్ రద్దు చేయొచ్చని కథనాలు ప్రసారం  అవుతున్నాయి. అందులో భాగంగానే ఆర్‌బీఐ ముందుగా డిపాజిటర్లను కాపాడుకుంటోందని విశ్లేషకులు చెప్తున్నారు.