Pakistan Cricket: సొంత దేశస్థులను నమ్మని పాక్.. కోచ్‌గా మళ్లీ విదేశీయులే

Pakistan Cricket: సొంత దేశస్థులను నమ్మని పాక్.. కోచ్‌గా మళ్లీ విదేశీయులే

2023 వన్డే ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పపీసీబీ) విదేశీ కోచ్‌ల సేవలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా బాబ‌ర్ ఆజాంను త‌ప్పించ‌డంతో పాటు విదేశీ కోచ్‌లు మోర్నీ మోర్కెల్,  మికీ ఆర్థర్, బ్రాడ్‌బ‌ర్న్‌ల‌పై వేటు వేసింది. ఆపై పాక్ తాత్కాలిక కోచ్‌గా ఆ జట్టు మాజీ ఆట‌గాడు మహమ్మద్ హ‌ఫీజ్ ను నియమించింది. అయితే, కోచ్‌గా ఏమాత్రం అనుభ‌వం లేని హఫీజ్ జట్టును విజయాల బాటలో నడిపించలేకపోయాడు. అత‌ని ఆధ్వర్యంలో పాక్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో ఘోర ఓటములు చవిచూసింది. దీంతో బుద్ధి తెచ్చుకున్న పీసీబీ.. మరోసారి విదేశీ కోచ్‌ల కోసం వేట మెదలుపెట్టింది. 

టార్గెట్ 2024 టీ20 వరల్డ్ కప్

గతేడాది వన్డే ప్రపంచ కప్ లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్తాన్.. ఈ  ఏడాది పొట్టి ప్రపంచ‌క‌ప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకుగాను నికార్సైన కోచ్ కోసం వెతుకుతోంది. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండ‌ర్ షేన్ వాట్సన్‌..  కొత్త హెడ్‌కోచ్‌గా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీసీబీ అధికారులు అతనితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం వాట్సన్ పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌(PSL)లో క్వెట్టా గ్లాడియేట్స్‌కు కోచ్‌గా వ్యవ‌హ‌రిస్తున్నాడు. దీంతో పీసీబీ ప్రయత్నాలు సఫలమయ్యాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

వాట్సన్‌ కాదంటే స‌మీ

ఒకవేళ హెడ్‌కోచ్ పదవికి వాట్సన్‌ అంగీకరించకపోతే,  వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండ‌ర్ డారెన్ స‌మీని ప్రత్యామ్నాయంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా విజ‌య‌వంత‌మైన స‌మీ.. విండీస్‌ జట్టుకు రెండు పర్యాయాలు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీలు అందించాడు..

ALSO READ :- WPL 2024: మహిళా క్రికెటర్ అసాధారణ ఇన్నింగ్స్.. బ్యాట్ తనిఖీ చేసిన మ్యాచ్ రిఫరీ

 అంతేకాదు పెషావ‌ర్ జ‌ల్మీ జ‌ట్టుకు సార‌థిగానూ కొన‌సాగాడు. దీంతో వీరిద్దరిలో ఒక‌రిని హెడ్‌కోచ్‌గా నియ‌మించేందుకు పీసీబీ ఆస‌క్తి చూపిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌ ముగిసేనాటికి దీనిపై ఓ స్పష్టత రానుంది.