టీమిండియా స్టార్ సిన్నర్ కుల్దీప్ యాదవ్ సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ నెలాఖరులో ఈ మిస్టరీ స్పిన్నర్ వివాహం కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో తన చిన్ననాటి స్నేహితురాలితో నిశ్చితార్థం చేసుకున్న కుల్దీప్.. ఈ నెలాఖరులో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం కుల్దీప్ యాదవ్ తనను భారత జట్టులో నుంచి రిలీజ్ చేయాలని బీసీసీఐని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. నవంబర్ చివరి వారంలో తనకు ఒక వారం పాటు సెలవులు కావాలని రిక్వెస్ట్ చేసాడట.
నవంబర్ చివరి వారంలో టీమిండియా సౌతాఫ్రికాతో రెండో టెస్టుతో పాటు ఒక వన్డే ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్ లకు కుల్దీప్ దూరమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నవంబర్ 22 నుంచి గౌహతిలో సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. నవంబర్ 30న రాంచీలో తొలి వన్డే ప్రారంభమవుతుంది. కుల్దీప్ రిక్వెస్ట్ పై జట్టు యాజమాన్యం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అతని సేవలు జట్టుకు ఎప్పుడు, ఎలా అవసరమో ఆలోచించి సెలవులు మంజూరు చేయబడతాయనే టాక్ ఉంది. "కుల్దీప్ వివాహం నవంబర్ చివరి వారంలో జరగనుంది. అతనికి ఖచ్చితమైన సెలవుల సంఖ్యను మంజూరు చేసే ముందు అతని సేవలు ఎప్పుడు అవసరమో జట్టు యాజమాన్యం అంచనా వేస్తుంది". అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి
ఇటీవలే ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా చివరి రెండు మ్యాచ్ లకు కుల్దీప్ యాదవ్ జట్టుకు దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం ఇండియా టీ20 జట్టు నుంచి రిలీజ్ చేశారు. ఇండియా ఎ, సౌతాఫ్రికా ఎ జట్ల మధ్య జరగబోయే రెండో అనధికారిక టెస్ట్ లో కుల్దీప్ ఆడిన కుల్దీప్.. శుక్రవారం (నవంబర్ 14) సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఈ చైనా మన్ స్పిన్నర్ 12 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. ఒకవేళ కుల్దీప్ ని రిలీజ్ చేస్తే అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.
