ట్యాంక్ బండ్పైనే గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలె : వీహెచ్పీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి

ట్యాంక్ బండ్పైనే గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలె : వీహెచ్పీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను విశ్వహిందూ పరిషత్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై ఈరోజు (సెప్టెంబర్ 27) అర్ధరాత్రిలోపు విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్, ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకపోతే తామే ఏర్పాట్లు చేసుకొని నిమజ్జనాలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి.. న్యాయస్థానాల పేరుతో ఆంక్షలు విధించినా ఊరుకునేది లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయక విగ్రహాల నిమజ్జనాలను ట్యాంక్ బండ్ లోనే చేసి తీరుతామని స్పష్టం చేశారు. 

ట్యాంక్ బండ్ లోనే గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ 44 సంవత్సరాలుగా వస్తున్న హిందూ సాంప్రదాయాల ఆనవాయితీ అని చెప్పారు. మిగతా పండగలకు ఏర్పాట్లు చేసే రాష్ట్ర ప్రభుత్వం భాగ్యనగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలకు మాత్రం ఏర్పాట్లు చేయకపోవడం దారుణమన్నారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు చేస్తున్నామని తప్పుడు ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.