ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లా కేంద్రాలతో పాటు మండలాలు, గ్రామాల్లో ప్రభుత్వ ఆఫీస్లు, స్కూళ్లు, కాలేజీలు, పోలీస్ స్టేషన్లు, పలు పార్టీల ఆఫీస్లు, పంచాయతీ కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ముఖ్యఅతిథులుగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం భారత రాజ్యాంగం విశిష్ఠతను వివరించారు. విద్యార్థులు చేసిన దేశభక్తి నినాదాలతో పల్లెలు, పట్టణాలు మార్మోగాయి. విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి దేశభక్తి గీతాలు ఆలపించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇరు జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలు, విద్యాని, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. వెలుగు, నెట్వర్క్
