- ఉత్తమ సేవలందించిన సిబ్బందికి పురస్కారాలు
హైదరాబాద్, వెలుగు: నర్సింగ్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయకుమార్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారిని గౌరవించుకోవడం గౌరవంగా ఉందని తెలిపారు. సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా హాస్పిటల్‌లో నర్సింగ్ ఆఫీసర్లకు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయకుమార్ మాట్లాడారు.
మహిళలు, చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణలో నిలోఫర్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ క్రెడిట్ అంతా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న వైద్య సిబ్బందిదేనని కొనియాడారు. ‘‘డాక్టర్లు చికిత్స అందిస్తే.. దాన్ని అమలు చేసి, పేషెంట్ కోలుకునేదాకా కంటికి రెప్పలా కాపాడేది నర్సింగ్ ఆఫీసర్లే. అత్యవసర సమయాల్లో వాళ్లు చూపిస్తున్న అంకితభావం అద్భుతం. ఇలాంటి అవార్డులతో వారిలో మరింత ఉత్సాహం పెరుగుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ బాలమణి, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ సముద్ర, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ అమృతతో పాటు నర్సింగ్ ఆఫీసర్లు స్వాతి, రుడావత్ లక్ష్మణ్, దీపిక, సంధ్యారాణి తదితరులను శాలువాలు, మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ ఆనంద్, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) రాష్ట్ర సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, డీసీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ నాగ జ్యోతి తదితరులు పాల్గొని సిబ్బందిని అభినందించారు.
