పిల్లలపై లైంగిక దాడులకు ఉరి శిక్ష

పిల్లలపై లైంగిక దాడులకు ఉరి శిక్ష

న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పోక్సో చట్టాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన సవరణలను ఆమోదించింది. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష వేసేలా నిబంధనలను పొందుపరిచింది. మైనర్లపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు విధించనుంది. అలాగే చైల్డ్‌‌ పోర్నోగ్రఫీకి పాల్పడితే జరిమానా, జైలు శిక్ష విధించేలా చట్ట సవరణ చేయనుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌‌ ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. దేశంలో పిల్లలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని, వీటిని నియంత్రించేందుకు పోస్కో చట్టాన్ని మరింత పటిష్టం చేశామని ప్రభుత్వం తెలిపింది.

ట్రాన్స్​జెండర్ల బిల్లుకు ఆమోదం

సామాజికంగా, ఆర్థికంగా, ఎడ్యుకేషన్ పరంగా ట్రాన్స్​జెండర్ల సాధికారత కోసం ఓ మోకానిజం ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. ట్రాన్స్​జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) బిల్లుకు ఓకే చెప్పింది. ‘‘ఈ బిల్లు వల్ల ఎంతో మంది ట్రాన్స్​జెండర్లు లబ్ధి పొందుతున్నారు. వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు, వారిపై కొనసాగుతున్న వివక్షను రూపుమాపేందుకు ఎంతో ఉపయోగపడుతుంది” అని ప్రభుత్వ అధికారులు చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు.