
- జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి
నర్సాపూర్, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నర్సాపూర్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఏర్పడిందని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. సింగూరు జలాలు విడుదల కావడంతో మంజీరా నది తీరంలో ప్రధాన పైపులైన్ లీకేజీ కారణంగా మిషన్ భగీరథ ద్వారా నర్సాపూర్ నియోజకవర్గానికి తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు.
గోదావరి జలాలను కోమటిబండ ప్రత్యేక పైప్ లైన్ ద్వారా శివ్వంపేట సంపునకు మళ్లించి నియోజకవర్గానికి తక్షణమే నీటి సరఫరా ప్రారంభించేలా చూడాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. మంత్రి స్పందించి నీటిని విడుదల చేసేందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డిని ఆదేశించారు. తక్షణమే స్పందించిన మంత్రికి రాజిరెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.