ఢిల్లీ నుంచి డ్రిల్లింగ్ మెషిన్ ... ఉత్తరాఖండ్ టన్నెల్​లో కొనసాగుతున్న రెస్క్యూ పనులు

ఢిల్లీ నుంచి డ్రిల్లింగ్ మెషిన్ ... ఉత్తరాఖండ్ టన్నెల్​లో కొనసాగుతున్న రెస్క్యూ పనులు

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్​లోని టన్నెల్​లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల గుండా రెండు స్టీల్ పైపులను లోపలికి పంపించి, కార్మికులను సేఫ్ గా బయటకు తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం టన్నెల్ కూలిన చోట భారీ యంత్రాలతో డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఈ పనులు మంగళవారమే చేపట్టారు. డ్రిల్లింగ్ మెషిన్ పాడైపోవడంతో బుధవారం ఢిల్లీ నుంచి మరొకటి తెప్పించారు. మొదట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఢిల్లీ నుంచి చిన్యాలిసౌర్ కు తరలించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో టన్నెల్ దగ్గరికి తీసుకెళ్లారు. ‘మెషిన్ ఇన్ స్టాలేషన్ ప్రారంభించాం. దీనికి నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది. 

ఇన్ స్టాలేషన్ పూర్తయ్యాక డ్రిల్లింగ్ మొదలుపెడతాం. ఈ మెషిన్ తో గంటకు 4 నుంచి 5 మీటర్లు డ్రిల్లింగ్ చేయొచ్చు. మొత్తం 50 మీటర్లు డ్రిల్లింగ్ చేసేందుకు 10 గంటలు పడుతుంది’ అని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఐడీసీఎల్) డైరెక్టర్ అన్షు మనీశ్ ఖల్ఖో తెలిపారు. ‘‘కార్మికులను వీలైనంత తొందరగా రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వాళ్లతో నిరంతరం 
మాట్లాడుతూనే ఉన్నాం” అని చెప్పారు. 

కార్మికుల నిరసన.. 

కార్మికులు టన్నెల్​లో చిక్కుకుని నాలుగు రోజులవుతోందని, ఇంకెప్పుడు బయటకు తీసుకొస్తారని వాళ్ల కుటుంబసభ్యులు, తోటి కార్మికులు ప్రశ్నించారు. సహాయక చర్యల్లో ఆలస్యమవుతోందని బుధవారం టన్నెల్ దగ్గర నిరసన తెలిపారు.