
- సహాయక చర్యల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, ఫైర్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ దళాలు
- ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరదలపై డీజీపీ పర్యవేక్షణ
హైదరాబాద్, వెలుగు: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకున్న సుమారు 2 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ చేసింది. పోలీస్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్), రెవెన్యూ, ఫైర్ డిపార్ట్‌మెంట్లతో పాటు 2 హెలికాప్టర్లతో ఎయిర్ ఫోర్స్, ఆర్మీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
బాధితులను సురక్షిత ప్రాంతాలకు, షెల్టర్‌హోమ్‌లకు తరలించాయి. ఈ మేరకు డీజీపీ జితేందర్ గురువారం ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తం కావడం, అన్ని శాఖలు సమన్వయంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. వర్షాలు, వరద తీవ్రత ఎక్కువగా ఉన్న మెదక్, కామారెడ్డి సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మంగళవారం నుంచి నిరంతరం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.
ఎన్‌హెచ్ 44పై వెహికల్స్ దారి మళ్లింపు..
కామారెడ్డి జిల్లా భికనూర్ టోల్‌గేట్ సమీపంలోని ఎన్‌హెచ్ 44 (నాగ్‌పూర్ హైవే) ధ్వంసం కావడంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. సివిల్, ట్రాఫిక్ పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహాయంతో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రూట్‌లో ప్రయాణించే భారీ వాహనాలను మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద, కార్లు సహా ఇతర వెహికల్స్‌ను తూప్రాన్ వద్ద మేడ్చల్-, సిద్దిపేట--కరీంనగర్,-- జగిత్యాల,-- కోరుట్ల, -మెట్‌పల్లి, -ఆర్మూర్ మీదుగా -ఆదిలాబాద్ వైపు దారి మళ్లిస్తున్నట్లు డీజీపీ తెలిపారు.
జిల్లాల ఎస్పీలతో డీజీపీ పర్యవేక్షణ..
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సహాయక చర్యలను హైదరాబాద్ నుంచి డీజీపీ జితేందర్ పర్యవేక్షిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా స్థానిక పోలీసులతో నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. డీజీపీ జితేందర్ గురువారం ‘వీ6 వెలుగు’తో మాట్లాడుతూ.. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సహకారంతో రెండు హెలికాప్టర్లు రెస్క్యూ ఆపరేషన్ కోసం వినియో గిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది సిబ్బందితో కూడిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సమర్థవంతంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నదని వెల్లడించారు. మెదక్, కామారెడ్డి, సిద్దిపేట సహా పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నామన్నారు. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసం కావడంతో పలు రైళ్లను రద్దు చేశారు.